mictv telugu

నా భార్యను రేప్ చేసినవారికి శిక్ష పడేవరకు వదలను

January 14, 2019

పట్టపగలే అమ్మాయిలపై అకృత్యాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. మన సమాజంలో అన్యాయం జరిగిందని ఓ అమ్మాయి ఫిర్యాదు చేస్తే ఆమె అబద్ధాలు చెబుతోందని ఆమెపైనే నిందలు వేసేవారున్నారు. కానీ హర్యానాకు చెందిన జితేందర్ అనే యువకుడు తాను ప్రేమించిన అమ్మాయి అత్యాచారానికి గురైందని తెలిసి ఆమెను పెళ్లిచేసుకోవడానికి సిద్దపడ్డాడు. అలాగే ఆమెకు న్యాయం జరిగేవరకు పోరాడతానని నడుంబిగించాడు. జితేందర్‌ గురించి తెలిసిన జాతీయ అవార్డు గ్రహీత.. దర్శకురాలు విభా భక్షి తాను తెరకెక్కిస్తున్న ‘సన్‌‌రైజ్‌’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్‌లో అవకాశం ఇచ్చారు. తన జీవితంలో ఏం జరిగిందో జితేందర్‌ ఓ ఆంగ్ల మీడియాకు తెలిపాడు.

జితేందర్ మాట్లాడుతూ ‘నేను హర్యానాలోని ‌ఛత్తర్‌ గ్రామవాసిని. నేను పక్క గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాను. ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. మా పెద్దలు ఒప్పుకున్నారు. నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ, ఓ రోజు నా జీవితంలో మర్చిపోలేని సంఘటన గురించి వినాల్సి వచ్చింది. నా భార్య ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని రమ్మంది. నేను వెళ్లాను. తనపై సామూహిక అత్యాచారం జరిగిందని, పెళ్లిచేసుకోవడానికి తాను అర్హురాలిని కానని కుమిలిపోయింది. అది వినగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎవరో చేసిన తప్పుకు ఆమెను శిక్షించడం సరికాదనిపించింది. ఆమెను పెళ్లిచేసుకుంటానని మాత్రమే కాదు.. న్యాయం జరిగేలా చూస్తానని కూడా మాటిచ్చాను. అలా మా పెళ్లికి ముందే నా న్యాయపోరాటం మొదలైంది.

Telugu News I vowed to punish my wife s rapists .

హర్యానాలో అత్యాచారాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ పరువు పోతుందని బాధితుల నోళ్లు మూయించేస్తుంటారు. సమాజం ఆడవారినే తప్పుబడుతుందన్న విషయం మనకు తెలిసిందే. నా స్థానంలో మరో అబ్బాయి ఉండుంటే కచ్చితంగా పెళ్లికి ఒప్పుకొనేవారు కాదు. అత్యాచార బాధితులకు సమాజంలో గౌరవం ఉండదు. నా భార్యకు మాటిచ్చినట్లుగానే అత్యాచారానికి పాల్పడిన ఎనిమిది మంది నిందితులపై కేసు పెట్టాను’

‘న్యాయవాదులను మాట్లాడుకున్నాను. కానీ బెదిరింపులు రావడం మొదలయ్యాయి. వాటిని కూడా ఎదురుకున్నాను. కేసు గెలవడం కోసం రెండు ఇళ్ల స్థలాలు అమ్ముకున్నాను. నిందితులలో కొందరు పలుకుబడి ఉన్నవారట. దాంతో జిల్లా సెషన్స్‌ కోర్టు వారిని నిర్దోషులుగా తేల్చింది. దాంతో నేను హైకోర్టును ఆశ్రయించాను. నా భార్య నిద్రపోవడానికి కూడా భయపడేది. దాంతో ఆమె కోసం నా వ్యాపారాలను వదులుకుని ఆమె పుట్టింటికి దగ్గర్లోనే ఓ ఇల్లు తీసుకున్నాను. అలా దాదాపు 14 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నాను. ప్రస్తుతం నేను లా చదువుతున్నాను. పోలీసులు, న్యాయవాదులను నమ్ముకుంటే నాకు జరిగే మేలు ఏమీ లేదనిపించింది. అందుకే త్వరగా చదువు పూర్తిచేసి నా భార్య కేసును నేనే వాదించుకుంటాను. ఇప్పుడు నా భార్య కూడా లా చదువుతోంది. ఇద్దరం చదువు పూర్తిచేశాక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళల సంరక్షణ కోసం మాకు తోచిన సాయం చేస్తాం. ఏదో ఒక రోజు మా జీవితాల్లో మార్పు చోటుచేసుకుంటుందని, అన్నీ మర్చిపోయి హాయిగా జీవిస్తామని ఎదురుచూస్తున్నాను’ అని తెలిపారు.

Telugu News ‘I vowed to punish my wife’s rapists,’ says husband of rape survivor