చీర కట్టుకోవడం వచ్చని మీసం మెలేసి చెబుతున్నా.. - MicTv.in - Telugu News
mictv telugu

చీర కట్టుకోవడం వచ్చని మీసం మెలేసి చెబుతున్నా..

March 9, 2018

‘నాకు చీరకట్టుకోవడం వచ్చనే విషయాన్ని మీసం మెలేసి చెబుతాను ’ అని నటుడు, మక్కళ్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌ హాసన్‌ వ్యాఖ్యానించారు. మహిళా దినోత్సవం సందర్భంగా చెన్నైరాయపేట వైఎంసీఏ గ్రౌండ్స్‌లో గురువారం సాయంత్రం తన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో కమల్ ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు.‘పురుషాధిక్య సమాజంలో మార్పు రావాల్సిన అవసరం చాలా వుంది. ఇంటి తాళంచెవులు మహిళలకు అప్పగించేటప్పుడు దేశాన్ని అప్పగించడానికి మాత్రం ఎందుకు సంశయించాలి ?   నేను మహిళలను కీర్తిస్తున్నాను. వారికి ఆ అర్హత పుష్కలంగా వుంది. ఇదే విషయాన్ని ఎన్నో ఏళ్లుగా పూర్వీకులు చెబుతున్నారు.. అయినా ఎవరూ పట్టించుకోవటం లేదు. ఈ ఒక్కరోజే కాకుండా ఏడాది పొడుగునా మహిళా దినోత్సవాన్ని నిర్వహించి మహిళల్ని గౌరవిస్తూనే వుండాలి మనందరం ’ అని పేర్కొన్నారు.

 ప్రజాసేవలోనే తన ప్రాణం విడుస్తానని పేర్కొన్నారు. రాజకీయమనేది విద్యార్థుల జీవితాలను మార్చే శక్తి అని, ప్రతిఒక్కరూ వాటి గురించి తెలుసుకోవాలని అన్నారు. తాను పాఠశాలవిద్య కూడా ముగించలేదని, కళ తనను కాపాడిందని పేర్కొన్నారు. మార్పు తెచ్చేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజాపాలన వికసించాలంటే దానిని విద్యార్థులే నిర్ణయించాలని పిలుపునిచ్చారు.