భద్రత ఇచ్చాకే భారత్‌కు వస్తా - MicTv.in - Telugu News
mictv telugu

భద్రత ఇచ్చాకే భారత్‌కు వస్తా

March 20, 2018

ఉరుము ఉరిమి మంగళం మీద పడటం ఈయనను చూసి నేర్చుకోవాలంటోంది సీబీఐ. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఏకంగా రూ.13,000 కోట్లకు పైగా కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ గురించి తెలిసిందే. ఆయనను స్వదేశానికి వచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా సీబీఐ డిజిటల్ సమన్ల పంపింది. ఇందుకు మోదీ తాను విచారణను ఎదుర్కోలేనని సమాధానం ఇచ్చారు. సీబీఐ, ఈడీ తన ఆస్తులను, పత్రాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా దర్యాప్తుకు అవసరమైన సమాచారం తన దగ్గర లేదని ఆవేదన వ్యక్తం చేశారు.తన కార్యాలయంలో వున్న సర్వర్లను సీబీఐ స్వాధీనం చేసుకోవడం వల్ల, తన వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా పోయాయని చెప్పారు. చట్టప్రకారం తననుతాను సమర్థించుకునేందుకు వీలు లేకుండా చేశారని.. తన ప్రాథమిక హక్కును సరిగ్గా వినియోగించుకునే పరిస్థితిలో లేనని తెలిపారు. ఏ సమాచారం అందించలేని అసమర్థుడిగా మారిపోయానని తన సమాధానంలో మోదీ పేర్కొన్నారు. అలాగే తన భద్రత, పారదర్శక దర్యాప్తు నిర్వహించే విషయంలో తాను లేవనెత్తిన ప్రశ్నలకు సీబీఐ సమాధానం ఇచ్చాకే భారత్‌కు రావాలా, వద్దా అనేది ఆలోచిస్తానని పేర్కొన్నారు.