అసలైన భారతీయుడు..  34 ఏళ్లలో 71 బదిలీలు - MicTv.in - Telugu News
mictv telugu

అసలైన భారతీయుడు..  34 ఏళ్లలో 71 బదిలీలు

March 1, 2018

34 ఏళ్ళ ఐఏఎస్ సర్వీసులో ఆయన ఎంతో నిబద్ధతగా పనిచేశాడు. కానీ ప్రభుత్వం గుర్తించలేదు. ఆరు నెలల జీతం అందకుండానే ఆయన పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఆయన నిజాయితీకి దక్కిన గౌరవం!  హరియాణాకు చెందిన ఐఏఎస్ అధికారి ప్రదీప్ కాస్ని తన 34 ఏళ్ళ సర్వీసుకు ముగింపు పలికి రిటైర్ అయ్యారు. తన 34 ఏళ్ళ సర్వీసులో 71 సార్లు బదిలీ అవటం విశేషం. అంటే ఎక్కడా ఆరునెలలకు మించి పనిచేయనివ్వలేదు సర్కారీ పెద్దలు.అంటే దాదాపుగా ఏడాదికి రెండు సార్లు ఆయన బదిలీ అయ్యారు. ఆయన చేసిన పొరపాటల్లా హరియాణా భూ ఉపయోగ బోర్డులో(ల్యాండ్‌ యూస్‌ బోర్డ్‌) ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ(ఓఎస్‌డీ)గా విధుల్లో చేరటం. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆయన పనిచేస్తున్న బోర్డే రికార్డుల్లో లేకపోవటం విచారకరం. ఈ బోర్డును పర్యావరణ విభాగం కింద తొలుత ప్రవేశపెట్టారు. తర్వాత వ్యవసాయ విభాగానికి బదిలీ చేసి అనంతరం బోర్డును మూసేశారు. అయితే హరియాణా ప్రభుత్వం అసలు ఉపయోగంలోనే లేని బోర్డుకు ప్రదీప్‌ను ప్రత్యేక ఆఫీసర్‌గా బదిలీ చేయటం గమనార్హం. అక్కడే ఆయనకు చిక్కు వచ్చి పడింది.

దీంతో ఆయనకు గత కొన్ని నెలలుగా జీతం అందడం లేదు. ఈ విషయం ఆయనకు సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన పిటిషన్‌ ద్వారా తెలిసింది. దీనిపై ప్రదీప్‌ సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునలో ఫిర్యాదు చేయగా, అది మార్చి 8న ఈ కేసుపై నిర్ణయం తీసుకోనుంది.

తన హక్కుల కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు. రిటైర్‌ అయినప్పటికీ తన పదవీ కాలం కొనసాగించాలని అడుగుతున్నారు. ప్రదీప్‌ భార్య కూడా ఐఏఎస్‌ అధికారిణి. ఆమె గత ఏడాది రిటైర్‌ అయ్యారు. ప్రదీప్‌ అత్యధికంగా కాంగ్రెస్‌ ప్రభుత్వంలో భూపీందర్‌ సింగ్‌ హయాంలో బదిలీ అయ్యారు. ఖట్టార్‌ హయాంలో 2016లో మూడు సార్లు బదిలీ అయ్యారు. ప్రభుత్వం నుండి ఎలాంటి సమాధానం లేకపోవడంతో ఆర్టీఐ చట్టం ద్వారా పిటిషన్‌ వేశారు. దీంతో  ఆ ల్యాండ్‌ యూస్‌ బోర్డు 2008 నుంచి మనుగడలో లేదని సమాధానం వచ్చింది.