నన్ను గెలిపిప్తే మటన్, మందు, టీ, కాఫీ.. ఫ్రీ.. - MicTv.in - Telugu News
mictv telugu

నన్ను గెలిపిప్తే మటన్, మందు, టీ, కాఫీ.. ఫ్రీ..

April 7, 2018

ఏమిటో.. రోజురోజుకు రాజకీయి నాయకులు చేస్తున్న ఎన్నికల వాగ్దానాలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి నెలకొని వుంది. ఒకర్ని మించి ఒకరు ఎన్నికల మేనిఫెస్టోలు రూపొందిస్తుంటారు. ఎటుపోయి జనాలు వెర్రివాళ్ళు అవటం ఖాయం. ఎన్నికల ముందు గడప గడపకు తిరిగి వరాలు కురిపించే నాయకులు గెలిచాక కూడా తమ గుమ్మాల దగ్గరికి వస్తే సమాజం ఎప్పుడో బాగుపడేదేమో. వాళ్లు నెరవేర్చింది లేదు అన్నది తర్వాత విషయం.. ఇప్పటి వరకు చాలా మంది నాయకులు చాలా రకాల హామీలు చేశారు.తాజాగా కర్ణాటక శాసన సభ ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. చింతామణి నియోజక వర్గం స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎన్. సురేష్ అనే వ్యక్తి ఎందరో రాజకీయ నాయకులు చేయని హామీలు చేస్తున్నాడు. తాను ఎమ్మెల్యే అయితే వారంలో రెండు సార్లు మటన్, 300 గ్రాముల చికెన్, మూడు పూటల బోజనం, రోజుకు రెండు సార్లు టీ, కాఫీ ఫ్రీగా ఇస్తానని మేనిఫెస్టోలో తెలిపాడు. స్కూల్ ఫీజులు కూడా ఉచితంగా ఇస్తానని చిత్రమైన హామీలు ఇస్తున్నాడు. తాను ఎమ్మెల్యే అయితే 18 ఏళ్ళు దాటిన యువతకు మద్యం ఫ్రీగా ఇస్తానని ప్రకటించాడు. అలాగే ఆడపడుచులకు ధనియాల పొడి, కారంపొడి, ఊరగాయలు ఉచితంగా ఇస్తానని తెలిపాడు.  మొబైల్ రీచార్జ్, ఇంటర్మెట్ డేటా, మధ్య తరగతివారి పెళ్లికి ఉచితంగా బంగారు తాళిబొట్టు, కొత్త బట్టలు ఇస్తాం.. వృద్దులకు తామే ఉద్యోగాలు కల్పిస్తామని తదితరాలు ఉచితంగా అన్నీ ఇస్తానని వైఎన్. సురేష్ మేనిఫెస్టోలో ప్రకటించాడు.

 

కాగా సురేష్ ఇచ్చిన హామీలపై మీడియా ప్రశ్నించింది.   మీరు ప్రకటించిన హామీల వల్ల ప్రజలు మరింత సోమరిపోతులు అయిపోతారు కదా అంటే.. నేను ఏదో ఒక ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తున్నవారికే ఈ పథకాలు వర్తించేలా చూస్తాను. పైగా దేశంలో అవినీతి పెరిగింది కాబట్టి అందరికీ ఉచితంగా ఇవ్వటం వల్ల అవినీతి తగ్గుతుందని తనను తాను సమర్థించుకున్నారు సురేష్. ఉచితంగా లిక్కర్ ఇవ్వటం వల్ల యువత చెడిపోతుంది కదా అంటే.. నేనేమీ రోజు ఉచితంగా ఇస్తానని చెప్పలేదు. వారానికి ఒకసారి మాత్రమే అన్నాను అని సమాధానం ఇచ్చారు. మద్యం దుకాణాలు పూర్తిగా మూసి వేసి వాటిని తానే స్వాధీనం చేసుకుని వారంలో ఒక్క రోజు ఉచితంగా ఇస్తానని, ఇష్టం అయిన వాళ్లు తాగవచ్చు లేదా వదిలేయవచ్చని వైఎన్. సురేష్ అన్నారు. కనీ వినీ ఎరుగని రీతిలో వున్న సురేష్ వాగ్దానాలను చూసి చింతామణి నియోజక వర్గ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.