ఒలంపిక్స్‌లో ఎంపిక చెయ్యకుంటే ఆత్మహత్య చేసుకుంటా ! - MicTv.in - Telugu News
mictv telugu

ఒలంపిక్స్‌లో ఎంపిక చెయ్యకుంటే ఆత్మహత్య చేసుకుంటా !

February 7, 2018

కామన్వెల్త్ గేమ్స్‌లో తనను ఎంపిక చేయకపోతే భారత్ ఒలంపిక్ అసోసియేషన్ ( ఐఓఏ ) ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని ’ ఓ భారత క్రీడాకారిణి హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. గ్లాస్గోలో నిర్వహించిన కామన్వెల్త్‌ గేమ్స్‌ లైట్‌వెయిట్‌ కేటగిరీలో పతకం గెలిచిన పారా వెయిట్‌ లిఫ్టర్‌ సకీనా ఖాతూన్‌ పై వ్యాఖ్యలు చేసింది.

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో కొద్ది రోజుల్లోనే ప్రారంభమయ్యే కామన్వెల్త్ గేమ్స్-2018కు భారత్ తరుపున ప్రాతినిత్యం వహించనున్న కొందరి క్రీడాకారుల జాబితాను ఐఓఏ  ప్రకటించింది. ఈ జాబితాలో సకీనా పేరు లేకపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలిపింది. ‘ ఈ ఏడాది కామన్వెల్త్‌ గేమ్స్‌ కోసం నేను నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. అందుకోసం చాలా కష్టపడ్డాను. ఎన్నో కలలు కన్న నన్ను ఎంపిక చేయకపోవడంతో నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ విషయమై చాలా ఒత్తడికి గురవుతున్నాను ’ అంటూ భారత పారా ఒలంపిక్‌ కమిటీకి సకీనా లేఖ కూడా రాసింది.

‘ కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనటానికి చివరి వరకు పోరాడతాను. భవిష్యత్తులో ఐఓఏ నామీద పక్షపాతం చూపకుండా నాపేరు ప్రకటిస్తుందని వేచి చూస్తాను. నాపేరు లేకపోతే కోర్టుకు కూడా వెళతాను. వారు నా జీవితాన్ని నాశనం చేశారని ఐఓఏ ముందు ఆత్మహత్య చేసుకుంటాను.

ఆడటానికి అభిరుచి వున్న క్రీడాకారులను ఐఓఏ ప్రోత్సహించాలి ’ అని సకీనా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఐఓఏ స్పందిస్తూ కొన్ని మార్పులు చేయడం వల్లే ఆమెను ఎంపిక చేయలేదని తెలిపింది. కాగా భారత పారా ఒలంపిక్‌ కమిటీ కూడా సకీనా లేఖకు స్పందించింది. కామెన్వెల్త్‌ గేమ్స్‌ కమిటీతో చర్చించి సకీనాను ఆడేలా చూడాలని ఐఓఏకు లేఖ రాసినట్టు సమాచారం.