లొంగకపోతే  కేసు పెడతా.. నర్సుకు వేధింపులు - MicTv.in - Telugu News
mictv telugu

లొంగకపోతే  కేసు పెడతా.. నర్సుకు వేధింపులు

April 19, 2018

అధికారం చేతిలో వుంది కదా అని కింది స్థాయి ఉద్యోగులను ఏమన్నా చెల్లుతుందా ? చెల్లదు. పాపం పండుతుంది. ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో జరిగింది ఈ ఉదంతం. అందులో పని చేస్తున్న ఉన్నతాధికారి (డీఎంహెచ్‌వో) అన్నిమళ్ల కొండలరావు స్టాఫ్ నర్సుపై కన్నేశాడు. ఆమెను లొంగదీసుకోవాలని తన అధికారాన్ని అడ్డు పెట్టుకున్నాడు.

‘నువ్వు చాలా అందంగా వున్నావు. నా కోరిక తీర్చు’ అంటూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా తన వేధింపులను ఎక్కువ చేశాడు. ‘నా కోరిక తీర్చకపోతే నిన్నుటెర్మినేట్‌ చేయిస్తా. వ్యభిచారం కేసు పెట్టిస్తా’ అని బెదిరింపులు ఎక్కువ చేసేసరికి సదరు నర్సు అతని మీద మానవ హక్కుల కమీషన్‌లో ఫిర్యాదు చేసింది.  

‘నేను అతను చెప్పింది ఒప్పుకోకపోవడంతో 16 నెలల్లో ఆరుసార్లు డిప్యుటేషన్‌పై దూర ప్రాంతాలకు బదిలీ చేశాడు. అకారణంగా ఎందుకు బదిలీ చేస్తున్నారని అడిగాను.  తన కోరిక తీర్చకపోతే ఇలాగే చేస్తా.. నా కోరిక తీర్చు అంటూ అసభ్యంగా ప్రవర్తించాడు. సాయంత్రం 5.30 గంటల తర్వాత కార్యాలయానికి రావాలని వేధించేవాడు ’ అని తన ఫిర్యాదులో పేర్కొంది బాధిత మహిళ.

ఈ నేపథ్యంలో హెచ్‌ఆర్సీ…ప్రజా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. జూలై 10లోగా సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించింది.

 మొదటినుంచీ  అంతే

కొండలరావుకు మొదటి నుంచీ అంతే. డోర్నకల్‌ పీహెచ్‌సీలో, ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న సమయంలోనూ ఆయనపై వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై పలువురు ఫిర్యాదులు చేయటంతో అతనిపై డీఎంహెచ్ఓ అధికారులతో కమిటీ వేసి విచారణ బాధ్యత అప్పగించారు. అటు విచారణ కొనసాగుతుండగానే  కొండలరావుపై స్టాఫ్‌నర్సు ఫిర్యాదు చేయడం గమనార్హం.