ఐరస అభ్యర్థనను పక్కనపెట్టి మళ్ళీ బాంబులతో తెగబడ్డ సిరియా - MicTv.in - Telugu News
mictv telugu

ఐరస అభ్యర్థనను పక్కనపెట్టి మళ్ళీ బాంబులతో తెగబడ్డ సిరియా

March 3, 2018

సిరియాలోని తూర్పుగౌటాలోని నివాస సముదాయాలపై శుక్ర, శనివారాలు మళ్ళీ బాంబుల వర్షం కురిసింది.  ప్రస్తుతం తూర్పు గౌటాలో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పలు ఏజెన్సీలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ‘సేవ్‌ సిరియా’ అని నినదించిన అంతర్జాతీయ సమాజం అభ్యర్థను పక్కనపెడుతూ, ఐక్యరాజ్యసమితి ఆదేశాలను బేఖాతరుచేస్తూ అసద్‌ సైన్యాలు మళ్లీ జనావాసాలపై దాడులకు తెగబడ్డాయి. ఈ దాడుల్లో 25 మందికి పైగా పౌరులు చనిపోయారు.

ఫిబ్రవరి చివరివారంలో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి.. ‘ తూర్పుగౌటాపై దాడులను వెంటనే నిలిపేయాలి ’ అని ఏకగ్రీవ తీర్మానం చేసింది. నెల రోజులు కాల్పులు జరపరాదంటూ సిరియా – రష్యాలను ఆదేశించింది. ఆ నిర్ణయం తర్వాత పలు స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగాయి. మూడు నెలలుగా సరైన ఆహారం, వైద్యసేవలు లేక అలమటిస్తోన్న గౌటా వాసులను ఆదుకునే ప్రయత్నం చేశాయి. ఇంతలోనే కాల్పుల విమరణ ఒప్పందానికి విరుద్ధంగా అసద్ సైన్యాలు మళ్లీ బాంబు దాడులకు తెగబడటం విస్మయానికి గురి చేస్తోంది.