సోనియా గాంధీ సంచలన నిర్ణయం.. రాజకీయాలకు గుడ్‌బై - MicTv.in - Telugu News
mictv telugu

సోనియా గాంధీ సంచలన నిర్ణయం.. రాజకీయాలకు గుడ్‌బై

December 15, 2017

కాంగ్రెస్ పార్టీని, దేశాన్ని కనుసైగలతో ఏలిన  నాయకురాలు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 19 ఏళ్ళు కాంగ్రెస్‌కు సారథ్యం వహించి చరిత్ర సృష్టించిన  సోనియా.. తన కుమారుడు  రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాహుల్ శనివారం పగ్గాలు చేపట్టనున్న సంగతి తెలిసిందే.

శుక్రవారం  పార్లమెంటు సమావేశాలు వాయిదా పడిన అనంతరం బయటకు వస్తున్న సోనియా మీడియాతో మాట్లాడారు. ‘రాహుల్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ముందు ముందు పార్టీ వ్యవహారాల్లో మీ పాత్ర ఎలా వుండబోతోంది’ అని  ఓ విలేఖరి ఆమెను అడిగారు.అందుకు ఆమె బదులిస్తూ..  ‘ నేను రాజకీయాల్లోంచి తప్పుకుంటున్నాను ’ అని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ తర్వాత పూర్తిస్థాయి అధ్యక్షుడిగా రాహుల్‌ కొనసాగనున్నారు. ఇటీవల సోనియా తరచూ అనారోగ్యానికి గురి అవుతున్నారు. క్యాన్సర్‌కు సంబంధించిన చికిత్స కూడా పొందుతున్నారు. రాహుల్‌కు ఎప్పటినుండో పార్టీ బాధ్యతలు అప్పగించాలనుకుంటున్న సోనియా కల ఇన్నాళ్ళకు నెరవేరడంతో ప్రశాంతంగా జీవించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి పదవికి చేపట్టే అవకాశం వచ్చినా.. తాను విదేశీయురాలినని విమర్శలు రావడంతో ఆమె ఆ పదవిని తిరస్కరించడం తెలిసిందే.