చూస్తేనే వాంతికొచ్చేలా.. అయినా  తాగుతారేమో..! - MicTv.in - Telugu News
mictv telugu

చూస్తేనే వాంతికొచ్చేలా.. అయినా  తాగుతారేమో..!

April 6, 2018

సిగరెట్లు, గుట్కాలు ఆరోగ్యానికి మంచివి కావు అని ఎంత మొత్తుకున్నా ఎవరు పట్టించుకుంటున్నారు? అందుకే చెప్పడం కన్నా చూపిస్తే బాగుంటుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ భావించింది. పొగాకు ఉత్పత్తులపై ముద్రించే చిత్రాలను కేంద్రం మరింత భయానకంగా రూపొందించింది. ఇప్పటి వరకు వున్న నిబంధనలను మారుస్తూ భయానక హెచ్చరికల చిత్రాలను విడుదల చేస్తున్నట్టు పేర్కొంది.ఇందుకు సంబంధించిన రెండు సెట్ల ఇమేజ్‌లను విడుదల చేసింది. తొలి సెట్ 12 నెలల పాటు అన్ని పొగాకు ఉత్పత్తులపై ముద్రించాలని, ఆపై రెండో సెట్ బొమ్మలను ముద్రించాలని తేల్చిచెప్పింది. అలాగే పొగాకు వాడకం వల్లే కలిగే అనర్ధాల గురించి వివరించే టోల్ ఫ్రీ నెంబర్‌ను (1800-11-2356) కూడా జత చేయాలని సూచించింది. ఈ నెంబర్‌ను సంప్రదించిన వారికి దాని దుష్ఫలితాల గురించి వివరిస్తారట. కొత్త హెచ్చరికల చిత్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్‌సైట్(www.mohfw.gov.inనుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ కొత్త హెచ్చరికల చిత్రాలను అన్ని స్థానిక భాషల్లో త్వరలోనే మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 1, 2018 నుంచి ఈ కొత్త హెచ్చరికల చిత్రాలను ముద్రిస్తారని సమాచారం. అయితే మందు, సిగరెట్లు మానుకోలేని వ్యవసనాలని, ఇంతకంటే ఘోరమైన బొమ్మలను అచ్చేసిన హాయిగా చూసుకుంటూ తాగుతారని నెటిజన్లు అంటున్నారు. చివరికి మలమూత్రాల బొమ్మలను అచ్చేసినా హాయిగా తాగేస్తారని అంటున్నారు.

గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే వెల్లడించిన నివేదిక ప్రకారం, ప్రస్తుతం సిగరెట్లు తాగుతున్న వారిలో 15 ఏళ్లలోపు వారు కూడా ఉన్నారని వెల్లడైంది. బీడీ స్పోకర్లు 53.8 శాతం, స్మోక్‌ చేయని పొగాకు వినియోగదారులు 46.2 శాతం మంది ఉన్నట్టు సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్రం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని తెలుస్తోంది.