లంచం ఇవ్వటంలో కొత్త ఒరవడి.. వీళ్ళ తెలివికో దండం - MicTv.in - Telugu News
mictv telugu

లంచం ఇవ్వటంలో కొత్త ఒరవడి.. వీళ్ళ తెలివికో దండం

March 20, 2018

ముదుర్లకు మహా ముదుర్లు ఈ విద్యార్థులు. లంచం ఇవ్వటంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఈ ఇంటర్మీడియట్ చదువుతున్న  విద్యార్థులు టీచర్లకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. సరిగ్గా చదవకుండా, నకలు కొడితే ఎక్కడ పట్టుబడుతామోనని ఏకంగా టీచర్లకు లంచం ఇవ్వాలని ఓ ప్లాన్ వేశారు వాళ్ళు. సమాధానాలు రాసిన పేపర్‌లో రూ.500, రూ.100 నోట్లు పెట్టారు. ‘ సర్ ఈ నోట్లు స్వీకరించి మమ్ము పాస్ చెయ్య ప్రార్థన.. ’ అని పక్కన రాసారు కూడా. నోట్లను ఆన్సర్ షీట్ల మధ్యన జతచేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌కు చెందిన ఇంటర్‌ విద్యార్థులు ఈ ఘనకార్యానికి పాల్పడ్డారు. పిల్లలు రాసిన సమాధానాలను దిద్ది మార్కులేద్దాం అనుకున్న ఉపాధ్యాయులకు, ఆన్సర్ షీట్లలోంచి రాలిపడుతున్న నోట్లను చూసి వారికి దిమ్మతిరిగింది. చదువులో లేని తెలివితేటలు ఇలాంటి పనుల్లో పెట్టినందుకు ఆశ్యర్యపోవటం ఆ ఉపాధ్యాయుల వంతైంది ? ఇంటర్‌‌బోర్డు పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనంలో ఈ వింత చోటు చేసుకుంది.చదువుకోకుండా పరీక్షలు రాయకుండా విద్యార్థులు ఇలాంటి పనులకు పాల్పడ్డారని మార్కులు దిద్దే ఉపాధ్యాయులు అంటున్నారు. తాము విద్యార్థులకు మెరిట్‌ ఆధారంగానే మార్కులు ఇస్తున్నామని, ఇలాంటి ట్రిక్స్‌కు, పిచ్చి పనులకు మార్కులు ఇవ్వట్లేదని తెలిపారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెడితే ఉత్తీర్ణత సాధ్యం అవుతుంది కానీ ఇలాంటి పనులు చేయటం వల్ల రాదని అన్నారు. విద్యార్థులందరూ కూడబలుక్కొని ఈపని చేసినట్టున్నారు. చాలా నోట్లు వచ్చాయి. అయినా మేము ఇలాంటివాటికి అమ్ముడుపోమని స్పష్టం చేశారు.