గుడ్లగూబ కళ్లు పొడిచి క్షుద్రపూజ.. హైదరాబాద్‌లో ఘోరం - MicTv.in - Telugu News
mictv telugu

గుడ్లగూబ కళ్లు పొడిచి క్షుద్రపూజ.. హైదరాబాద్‌లో ఘోరం

February 27, 2018

మూఢనమ్మకాలతో జనం ఉన్మాదుల్లా తయారవుతున్నారు.  కాలం మారుతున్నా మనుషులు మూఢ నమ్మకాలను విడిచిపెట్టకుండా ఇంకా పట్టుకొని వేలాడుతూ, ఆ ఉరికొయ్యకు ఎంతమందిని, ఎన్ని రకాలుగా బలి చేస్తున్నారో చెప్పటానికి ఇది ఒక నిదర్శనం. మొన్న ఉప్పల్ చిలుకా నగర్‌లో రోజుల పసి కందు తల నరికి క్షుద్ర పూజలు చేసిన ఘటన మరవక ముందే ఇంకో గగుర్పాటు కలిగించే ఘటన హైదరాబాద్, ట్యాంక్‌బండ్ సమీపంలోని డీబీఆర్ బస్‌స్టాప్‌లో జరిగింది. కానీ ఈసారి బలైంది బాలుడు కాదు నోరులేని ఓ పక్షి. ఓ అరుదైన జాతికి చెందిన గుడ్లగూబ కళ్లు పొడిచేసిన స్థితిలో కనిపించింది. పసుపు, కుంకుమ చల్లి, నిమ్మకాయలను కట్టి వదిలిపెట్టారు. ఈ గుడ్లగూబ కళ్లను పూర్తిగా కోల్పోయింది. ఈ తరహా గుడ్లగూబలను రహస్యంగా నగరంలోని ముర్గీచౌక్‌ ప్రాంతంలో రూ.లక్ష పైచిలుకు ధరలకు విక్రయిస్తుంటారని తెలిసింది. గుర్తు తెలియని వారు దాన్ని కొనుగోలు చేసి ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుస్తోంది.చాలా అరుదైన ఇండియన్‌ ఈగల్‌ ఓల్‌ ( గుడ్ల గూబ ) కళ్లను పొడిచేయడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. బస్‌స్టాప్‌లో భారీ గుడ్లగూబ ప్రాణాపాయ స్థితిలో కనిపించటంతో స్థానికులు భారతీయ ప్రాణిమిత్ర సంఘ్‌ ప్రతినిధులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ప్రాణిమిత్ర సంఘ్‌ సభ్యులు గిరిధర్‌గోపాల్‌ భారీ పక్షిని అరుదైన ఇండియన్‌ ఈగల్‌ ఓల్‌గా గుర్తించారు. కీకారణ్యాలు, మానవ సంచారం లేని ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఈ అరుదైన పక్షిని క్షుద్రపూజల కోసం వినియోగించినట్లు గుర్తించిన ప్రాణిమిత్ర సభ్యులు పక్షికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం జూపార్క్‌ అధికారులకు అందజేశారు. సుమారు రెండు కిలోల బరువున్న ఈ గుడ్లగూబ చాలా అరుదైనదని తెలిపారు.