శ్రీదేవిని కడసారి చూసి తట్టుకోలేక.. - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవిని కడసారి చూసి తట్టుకోలేక..

February 28, 2018

మంగళవారం రాత్రి నటి శ్రీదేవి భౌతికకాయం ముంబై చేరుకుంది. దుబాయ్ ప్రాసిక్యూషన్ వివిధ కోణాల్లో విచారించిన అనంతరం శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించిందని ధ్రువీకరించిన పిదప మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. దుబాయ్ నుంచి ముంబై చేరుకున్న శ్రీదేవి భౌతికకాయాన్ని ఆమె స్వగృహానికి తీసుకెళ్లారు.

ఈ రోజు ఉదయం 9.30 గంటల సమయంలో అభిమానుల సందర్శనార్థం ఆమె ఇంటికి సమీపంలోని సెలబ్రేషన్‌ స్పోర్ట్స్‌ క‍్లబ్‌లో ఉంచారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు భౌతిక కాయాన్ని అక్కడే ఉంచుతారు.  సెలబ్రెటీ స్పోర్ట్స్ క్లబ్ ముందు ఇప్పటికే వేలల్లో ఆమె అభిమానులు బారులు తీరి వున్నారు. కొందరైతే శ్రీదేవి మీద ప్రత్యేకమైన అభిమానంతో ఆమె మరణవార్త తెలిసినప్పటి నుంచి ఆమె ఇంటి ముందరే కడచూపు భాగ్యం కోసం వేచి చూస్తున్నారు. గుజరాత్, పంజాబ్, హర్యాణ, ఢిల్లీ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా దేశం నలుమూలల నుంచి ఆమె అభిమానులు తమ అభిమాన నటిని కడసారి చూడాలని తరలివచ్చారు. మధ్యాహ్నం  12.30 వరకు అభిమానులను అనుమతించనున్నారు.బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్‌ సినీ ప్రముఖులు కూడా ఇప్పటికే ముంబై చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సీనియర్‌ హీరో వెంకటేష్‌ ముంబై చేరుకున్నారు.  మరికొంతమంది తెలుగు సినీ ప్రముఖులు ముంబై పయనమయ్యారు.

సమయం కొంతే వుండటంతో అభిమానులందరికీ శ్రీదేవి కడచూపు భాగ్యం దక్కుతుందనేది అనుమానంగా మారింది. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీదేవి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. 3.30 గంటల సమయంలో విలేపార్లే హిందూ స్మశానవాటికలో శ్రీదేవి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.