మైసూర్ రాజకన్యతో పెళ్లి చేయిస్తా అని.. - MicTv.in - Telugu News
mictv telugu

మైసూర్ రాజకన్యతో పెళ్లి చేయిస్తా అని..

March 8, 2018

గొర్రెల్లా దేనికంటే దానికి తలూపే అమాయకులు వున్నంత వరకు మోసం చేసే నక్కల్లాంటి అతితెలివిగాళ్ళు కూడా వుంటారు.        ‘ నువ్వు గత జన్మలో మైసూర్ మహారాజువి.. నీ మహారాణి కూడా ఈ జన్మలో కోటీశ్వరురాలిగా పుట్టింది.. ఆమెతో వివాహం జరిపిస్తాను ’ అని మగధీర కథ చెప్పి ఓ అమాయకుణ్ణి నిండా ముంచాడో బాబా. ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. రాజేంద్రనగర్‌ గోల్డెన్‌ కాలనీకి చెందిన మెహతాబ్‌ హుస్సేన్‌ అలియాస్‌ ఆదిల్ (40) ప్రవృత్తిరిత్యా భూత వైద్యుడి అవతారం ఎత్తాడు. తన దివ్యదృష్ఠితో ఏమైనా చేయగలనని నమ్మిస్తాడు. అతని మూడో భార్య సకీనా ఫాతీమాతో కలిసి ఫర్నీచర్‌ వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఈజీ మనీ కోసం ఆదిల్ భూత వైద్యుడి అవతారం ఎత్తాడు. అమాయకులకు ఎలా వల వెయ్యాలనే పథకంలో స్నేహితుడు ఆజం ద్వారా ఆదిల్‌కు ఓ అమాయక చక్రవర్తి తగిలాడు. అతనే కర్ణాటకలోని బీదర్‌ జల్‌సంగీకి చెందిన వ్యాపారి రుస్తుంపటేల్‌ (42).అతణ్ణి ఎలాగైనా బురిడీ కొట్టించి తన పబ్బం గడుపుకోవాలనుకున్నాడు ఆదిల్. టిప్పు సుల్తాన్, ఆసిఫ్‌జాహి, కులీకుతుబ్‌షాహిలు ఎక్కడెక్కడ గుప్త నిధులు దాచారో తనకు తెలుసు అని రుస్తుంను నమ్మించాడు. ఇంకే రుస్తుం గుడ్డిగా ఆదిల్ మాటలు నమ్మాడు. రూ. 8 లక్షలు ఆదిల్‌కు ఇచ్చాడు. డబ్బు తీసుకున్న తర్వాత రుస్తుం చేతే తవ్వకాలు చేయించాడు. కానీ అక్కడ ఏమీ లభ్యం కాలేదు. దీంతో నువ్వు మనస్ఫూర్తిగా కార్యం తలపెట్టలేదని రుస్తుం మీద నెపం వేశాడు ఆదిల్. పూర్తిగా అతని మాయలోపడ్డ రుస్తుం ఆదిల్ చెప్పిందల్లా నిజమనే నమ్మాడు.

ఇంకే దొరికిన గొర్రెను సాంతం బరకాలని ఆదిల్ మరో పథకం పన్నాడు. అతని దగ్గర వున్న డబ్బంతా తెలివిగా లాగాలని చూశాడు. గుప్తనిధుల విషయాన్ని పక్కనపెట్టి కొత్త పన్నాగానికి పూనుకున్నాడు. ‘ 4వేల ఏళ్ల క్రితం నవ్వు సాక్షాత్తు మైసూర్ మహారాజువి. అప్పటి రాజకన్య అయిన నీ భార్య ఇప్పుడు మైసూర్‌లోనే పుట్టింది. ఆమె నీకు ప్రేమలేఖలు కూడా రాసింది. ఆమెతో నీ పెళ్లి జరిపించే పూచీ నాది ’  అంటూ మగధీర తరహా సినిమా కథ చెప్పేశాడు. ఆదిల్ చెప్పిందంతా నిజమని నమ్మి పులకించిపోయాడు రుస్తుం.

అలాగే తన దగ్గర రైస్ పుల్లింగ్ యంత్రం వుందని కూడా చెప్పాడు ఆదిల్. దాని ద్వారా కోట్లు సంపాదించవచ్చునని.. యంత్రం విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 2500 కోట్ల వరకు ఉంటుందని నమ్మించాడు. నమ్మించి రుస్తుం దగ్గర నుంచి రూ.3 కోట్ల వరకు గుంజాడు. అలా రకరకాలు అబద్ధాలతో రుస్తుం దగ్గర డబ్బులు గుంజుతూ అదిల్ బాగానే ఆస్తులు కూడబెట్టాడు. గోల్కొండ ప్రాంతంలో 2000 గజాల స్థలం, చింతల్‌మెట్‌లో ఓ భవనాన్ని నిర్మించాడు. అలాగే పలుమార్లు విదేశీ టూర్స్ కూడా వెళ్లి వచ్చాడు. కొంత కాలమయ్యాక రుస్తుంకు ఆదిల్ మాయమాటల మీద అనుమానం కలిగింది.

తన దగ్గర తీసుకున్న డబ్బు ఇవ్వాలని కోరాడు. దీంతో ఆదిల్ రుస్తుం మీదకు బెదిరింపులకు దిగాడు. హబీబ్ నగర్ రౌడీషీటర్ మహ్మద్ యూసుఫ్‌తో బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితుడు పురానిహవేలీ పోలీసులను ఆశ్రయించడంతో నిజాలు బయటపడ్డాయి. రంగప్రవేశం చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.