పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత కొత్త నోట్లు ఎలాంటి రంగుల్లో వస్తాయోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కొన్నింటిని ఎవరూ ఊహించని రంగుల్లో తెచ్చారు. రూ. 10 చాక్లెట్ రంగులో, రూ. 50 లేత నీలిరంగులో, రూ. 200 నారింజ రంగులో, రూ. 500 నోటు బూడిద రంగుల్లో వచ్చాయి. కానీ రూ. 20 కొత్త నోటు రంగు మాత్రం మారలేదు. రూ. 20 రంగును మార్చకపోవడానికి ఒక కారణం ఉంది. నిబంధనలూ గట్రాలేవుగాని అదొక సంప్రదాయంగా వస్తోంది. దీని వెనుక ఉన్న కథలోకి వెళ్తే.. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో రూ. 20 నోట్లను జారీపై సమావేశం జరిగింది. ఆ నోటు ఏ రంగుల్లో ఉండాలనే విషయంపై చర్చించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి పీడీ కాస్బేకర్ కూడా హాజరయ్యారు. రంగుపై ఎంతకూ పంచాయితీ ముగియలేదు. చర్చ మధ్యలో ఇందిరాగాంధీ దృష్టి కాస్బేకర్ జేబులో ఉన్న గులాబీ రంగు కవర్ పై పడింది. దాంతో ఆమె ఆ కవర్ను బయటికి తీయాలని కోరారు. అది పెళ్లి ఆహ్వాన పత్రిక. ఆ రంగు కవరు చూసిన ఇందిరాగాంధీ తనకు గులాబీ రంగు ఇష్టమని, అదే రంగులో రూ. 20 నోటు ఉండాలని చెప్పారు. 1972 జూన్ 1న గులాబీ రంగుతో కూడిన రూ. 20 నోటును ప్రభుత్వం విడుదల చేసింది.