వెయ్యి మందికి ఒక్క బస్సు.. ఇదీ మన ఘనత - MicTv.in - Telugu News
mictv telugu

వెయ్యి మందికి ఒక్క బస్సు.. ఇదీ మన ఘనత

September 25, 2018

ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే మనుషుల ప్రాణాల విలువ తెలుస్తుందా? ఎవరో చేసిన తప్పుకు అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సిందేనా? 62 మందిని బలిగొన్న కొండగట్టు ఘటన చూస్తే నిజమే అనిపిస్తోంది. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ప్రయాణించడంతోనే ప్రమాదం జరిగిందని చెప్పి, వారికి ఎంతో కొంత ఆర్థిక సాయం కింద ముట్టజెప్పి చేతులు దులుపుకుంటుంది ఆర్టీసీ యంత్రాంగం. అధిక బస్సులు నడిపి ఉంటే ఆ అమాయక ప్రజల ప్రాణాలు పోయేవా? అసలు ప్రమాదం జరిగేదా? ఇలా అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

Indian RTC Using 1 Bus For Thousand People  

వాస్తవానికి ప్రయాణికులకు సరిపడే బస్సులు నడిపితే ఎలాంటి ప్రమాదాలూ జరగవని నిపుణులు చెబుతున్నారు. థాయిలాండ్ దేశంలో 1000మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు 8 బస్సులు నడిపిస్తోంది అక్కడి ప్రభుత్వం. అలాగే సౌత్ ఆఫ్రికా దేశంలో ప్రతి 1000 మందికి 6 బస్సులు నడుస్తుండగా.. రష్యాలో  6 బస్సులు, ఆస్ట్రేలియాలో 4 బస్సులు నడుస్తున్నాయి. కానీ మన భారతదేశంలో మాత్రం ప్రతి 1000 మంది ప్రయాణికులకు కేవలం ఒక్క బస్సు నడుస్తోంది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే వెయ్యిమందికి 1.2 బస్సులుఉన్నాయి. పైన పేర్కొన్న దేశాలతో పోలిస్తే మన దేశంలోనే జానాబా ఎక్కువ. బస్సుల్లో ప్రయాణం చేసే వారి సంఖ్య ఎక్కువ. కానీ నడిచే బస్సులు మాత్రం తక్కువ.

మన దేశంలోని చాలా ప్రాంతాల్లో బస్సుల సంఖ్య తక్కువగా ఉండి ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. చాలా ఊర్లకు ఉదయం బస్సు వచ్చిందంటే.. మళ్లీ సాయంత్రం వస్తుంది. దీంతో ఎవరూ బస్సు మిస్ కాకుండా అదే బస్సులో ప్రయాణించాల్సి వస్తుంది. వారికి వేరే మార్గం ఉండదు. దీంతో బస్సులో నిల్చొడానికి కూడా స్థలం లేకున్నా ఏదోలా ప్రయాణం చేసి గమ్యం చేరడానికి ప్రయత్నిస్తుంటారు ప్రజలు. దీంతో బస్సులో పరిమితికి మించి జనాలు ఎక్కడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు ఉదయం కాలేజీకి వెళ్లేటప్పుడు.. సాయంత్రం ఇంటికి వచ్చే టప్పుడు సరైన సమయానికి బస్సులు దొరక్క కొన్ని కొన్ని సార్లు బస్సు టాప్ మీద కూడా కూర్చొని ప్రయాణం చేస్తుంటారు. ఇలా చేసి చాలామంది  విద్యార్థులు వారి ప్రాణాలు కోల్పోయారు.