2వేలు చెల్లించి..2రోజులు పేదరికంలో బ్రతకండి ! - MicTv.in - Telugu News
mictv telugu

2వేలు చెల్లించి..2రోజులు పేదరికంలో బ్రతకండి !

January 30, 2018

పేదరికంలో మగ్గుతున్న వారికోసం ముంబైలోని ఓ ఎన్జీవో సంస్థ  ఓ  కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ముంబైకి వచ్చే పర్యాటకులు ఎవ్వరైనా 2 వేల రూపాయలు చెల్లించి పేదరికాన్ని అత్యంత దగ్గరనుంచి  చూడవచ్చు రెండు రోజులు వారితో గడపవచ్చు. ముంబైలోని మురికి వాడల్లో నివాసం ఉండాలనుకునే పర్యాటకులు ఇచ్చే ,ఆ మెుత్తాన్ని ‘ స్లమ్ హోటల్’ పేరుతో  పర్యాటకులకు ఆతిథ్యం ఇచ్చే ఆపేద కుటుంబానికి ఇస్తారు.

పర్యాటకులు ఆ రెండు రోజులు 50 కుటుంబాలు వాడుకునే  ఒకే  టాయిలెట్‌నే వాడుకోవాలి. బెడ్డులు, పరుపులు ఏమీ ఉండవు..వారికి ఇచ్చే చాపపైన పడుకోవాలి.  దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని వెలుగుల వెనుక  చీకటిలో బ్రతుకున్న పేద ప్రజల గురించి ప్రపంచానికి  తెలియజేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్జీవో నిర్వహకుడు డేవిడ్ బిజిల్ తెలిపారు.

ముంబైకి చెందిన యువకుడు రవి సాన్సి డేవిడ్ బిజిల్ తో ఈ కార్యక్రమానికి  శ్రీకారం చుట్టారు. 16 మంది సభ్యులున్న సాన్సి కుటుంబం మెుత్తం ఒకే గదిలో నివాసం ఉంటున్నారు. తమ  దయనీయ స్థితులపై అతడు స్పందిస్తూ..‘ మా ప్రాంతానికి పర్యాటకులు వస్తారు. ఫేస్‌బుక్‌లో పెట్టుకునేందుకు వాళ్లు సరదాగా కొన్ని ఫోటోలు  తీసుకుని పోతారు. అలాంటప్పుడు మేము మురికివాడలో ఎదుర్కొంటున్న బాధలు వారికేం తెలుస్తాయి. అందుకే పర్యాటకులు మురికి వాడల్లోని ప్రజలతో కలిసిపోయేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము.ఈ కార్యక్రమం ద్వారా పేదప్రజల జీవన పరిస్థితులు,వారి స్థితిగతులపై అవగాహన ఏర్పడితే పేద బతుకులు మెరుగుపడుతాయని’ ఆయన  అన్నాడు.