గ్రీన్‌కార్డుల కోసం అమెరికాలో భారతీయుల ర్యాలీ - MicTv.in - Telugu News
mictv telugu

గ్రీన్‌కార్డుల కోసం అమెరికాలో భారతీయుల ర్యాలీ

March 20, 2018

అమెరికా పౌరసత్వమైన గ్రీన్‌కార్డుల జాప్యంతో అక్కడ వందలాది మంది భారతీయ ఉద్యోగులు సోమవారం ర్యాలీలు నిర్వహించారు. వీటి జారీకి బాగా జాప్యం జరుగుతోందని.. వీటి జారీ విషయంలో దేశాలవారి పరిమితిని వెంటనే ఎత్తివేయాలని కోరుతూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇప్పటికే చాలామంది భారతీయ సంతతి వ్యక్తులు గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. అయినా అక్కడి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారు. అమెరికాకు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయినప్పటినుంచి విదేశీయుల మీద వేటు పడిన విషయం తెలిసిందే.ఎప్పుడో లిండన్‌ జాన్సన్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కొన్ని నిబంధనలను పెట్టారని, ఈ కాలానికి అవి ఏమాత్రం సరిపోవని ర్యాలీ చేపట్టినవారు అభిప్రాయపడ్డారు. లిండన్‌ జాన్సన్‌ 1963 నుంచి 1969వరకు అధ్యక్షుడిగా పనిచేశారు.దేశాలవారీ కోటా వల్ల పెద్ద ఎత్తున వీరి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కోటా వల్ల ప్రవాస భారతీయులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ విషయంపై అమెరికన్లకు, శాసనకర్తలకు అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ర్యాలీ నిర్వహకులు తెలిపారు. అత్యధికంగా హెచ్‌1-బీ వీసాలపై అమెరికా వెళ్లి గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి నష్టం కలుగుతోందని, సంవత్సరాల తరబడి గ్రీన్‌కార్డుల కోసం ఎదురు చూడాల్సి వస్తోందని పేర్కొన్నారు.  ఓరెగావ్‌, అర్కాన్సాస్‌, కెంటుస్కీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. కెంటుస్కీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగిన టఈ ర్యాలీలో దాదాపు 300మంది గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిపుణులు పాల్గొనటం విశేషం.