పాకిస్తాన్‌పై ద్వేషం పెరిగిపోతోంది.. ! - MicTv.in - Telugu News
mictv telugu

పాకిస్తాన్‌పై ద్వేషం పెరిగిపోతోంది.. !

December 8, 2017

పాకిస్తాన్  పేరు వింటేనే చాలా మంది భారతీయులు కోపంతో ఊగిపోతారు. తాజాగా జరిగిన ఓ సర్వేలో ఇదే విషయం బయటపడింది.  వాషింగ్టన్‌కు చెందిన ‘ప్యూ రీసెర్చ్ సెంటర్ ’జరిపిన సర్వేలో ఏకంగా 72 శాతం భారతీయులకు  పాక్‌పై మంచి అభిప్రాయం లేదని వెల్లడైంది. ఈ సర్వేలో దాదాపుగా 2464 మంది అభిప్రాయాలు తెలుసుకున్నారు.

గత రెండు, మూడెళ్లతో పోలిస్తే పాకిస్తాన్‌పై   భారతీయులలో ప్రతికూల వైఖరి పెరిగిపోయింది. 2013లో 54 శాతం, 2014లో 49 శాతం పాకిస్తాన్‌పై వ్యతిరేక భావంతో ఉన్నారు. ఇప్పుడు ఇది కాస్తా 72 శాతానికి పెరిగింది. అందులోను ఉత్తర భారతంలో, పాక్ సరిహద్దు పంచుకునే రాష్ట్రాల్లో వ్యతిరేకత విపరీతంగా ఉంది.

పాకిస్తాన్ అంటేనే అసహ్యయించుకునే వారిలో కాంగ్రెస్, బీజేపీ అనుచరులు కూడా  ఉన్నారు. బీజేపీ అనుచరులు 70 శాతం ఉంటే, కాంగ్రెస్ అనుచరులు 63 శాతం పాక్‌ఫై  వ్యతిరేకతతో ఉన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ పట్ల 88 శాతం సానుకూలంగా ఉండడం విశేషం. అయితే పాక్‌తో ప్రధాని వ్యవహరిస్తున్న తీరును సమర్థించేవారు కేవలం 22శాతమే. కాశ్మీర్ అంశంపైన ప్రశ్నలు అడగ్గా, 62 శాతం కాశ్మీర్ చాలా తీవ్రమైన సమస్య అని చెప్పారు.63 శాతం కాశ్మీర్ విషయంలో మిలిటరీ చర్యలను మరింత బలంగా అమలు చేయాలని అభిప్రాయపడ్డారు.