మోదీ వెళ్లారని 2.8 లక్షలు తీసుకున్న పాక్ - MicTv.in - Telugu News
mictv telugu

మోదీ వెళ్లారని 2.8 లక్షలు తీసుకున్న పాక్

February 19, 2018

ప్రధాని  మోదీ రష్యా, అఫ్గానిస్తాన్, ఇరాన్, ఖతర్‌ సహా పలుదేశాలకు పాకిస్తాన్ మీదుగా వెళ్లినందుకు ఆ దేశానికి కేంద్రం రూ.2.86 లక్షలు చెల్లించింది. పాక్  గగనతలాన్ని వాడుకున్నందుకు ఈ మొత్తాన్ని నేవిగేషన్‌ చార్జీల కింద పాకిస్తాన్‌ వసూలుచేసినట్లు పాక్‌లోని భారత హైకమిషన్‌ కార్యాలయం తెలిపింది. నేవీ మాజీ అధికారి లోకేశ్‌ బాత్రా దాఖలు చేసిన ఆర్టీఐ పిటిషన్‌కు కమిషన్‌ ఈ మేరకు జవాబు చెప్పింది.

డిసెంబరు 2015లో రష్యా, ఆఫ్గానిస్థాన్‌ పర్యటనలకు వెళ్లిన మోదీ, తిరుగు ప్రయాణంలో అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టినరోజు కోసం లాహోర్‌లో దిగారు. ఆ సమయంలో ప్రధాని విమానానికి మార్గం చూపినందుకు రూ.1.49 లక్షలు పాకిస్థాన్ వసూలు చేసింది. ఇక 2016 మే 22-23 మధ్యన ఇరాన్ పర్యటనకు రూ. 77,215, అదే ఏడాది జూన్ 4-6 తేదీల్లో ఖతార్ పర్యటనకు రూ. 59,215ను పాక్ వైమానిక శాఖ వసూలు చేసినట్టు లోకేష్ బాత్రాకు గత జనవరి 30 న సమాచారం అందజేశారు. ఈ రెండు పర్యటనల్లోనూ పాక్ గగనతలం మీదుగా ప్రధాని విమానం పయనించింది.

మొత్తం మీద ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండేళ్లలో మోదీ విదేశీ పర్యటనలకు రూ. 2 కోట్లు ఖర్చయినట్టు కూడా వాయుసేన పేర్కొంది. 2016 జూన్ వరకూ నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, ఖతార్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, రష్యా, ఇరాన్, ఫిజీ, సింగ్‌పూర్‌తో సహ 11 దేశాల్లో పర్యటించిన మోదీ, ఇందుకోసం వాయుసేన బోయింగ్ 737 రకం విమానాలను వినియోగించారు.