ప‌ల్లెటూరి జీవ‌న శైలిని ఆవిష్కరించిన ‘ రంగస్థలం ’ - MicTv.in - Telugu News
mictv telugu

ప‌ల్లెటూరి జీవ‌న శైలిని ఆవిష్కరించిన ‘ రంగస్థలం ’

March 30, 2018

ప‌ల్లెటూరి జీవ‌న శైలి, క‌ట్లుబాట్ల‌ను, యాస‌, భాష‌ల్ని, అక్క‌డి దొర‌ల ఆధిప‌త్య సంస్కృతిని ప్ర‌తిబింబించే క‌థాంశాలతో తెలుగులో సినిమాలు రూపొంది ద‌శాబ్దాలు దాటిపోయాయి. భూమినే న‌మ్ముకొని బ‌తికే మ‌ట్టి మ‌నుషుల జీవితాల్లోని ఆవేద‌న‌ను, ఆక్రోషాన్ని ఆవిష్క‌రించే సినిమాలు 1990 ద‌శ‌కం త‌ర్వాత తెలుగులో రాలేవనే చెప్ప‌వ‌చ్చు.  గ‌తంలో బి. న‌ర‌సింగ‌రావు, దాస‌రినారాయ‌ణ‌రావుతో పాటు కొంద‌రు ద‌ర్శ‌కులు అగ్ర‌వ‌ర్ణాల పాల‌న‌లో దోపిడికి గురైన పేద‌ల బ‌త్రుకుల్ని త‌మ సినిమాల్లో చూపించారు. కానీ ఈ గ్రామీణ నేప‌థ్య‌ క‌థాంశాల‌కు వాణిజ్య హంగుల‌ను, స్టార్ ఇమేజ్‌ను జోడించి య‌దార్థ కోణంలో చూపించే ప్ర‌య‌త్నాల్ని ఏ ద‌ర్శ‌కుడు చేయ‌లేదు. తొలిసారి రంగ‌స్థలం సినిమాతో సుకుమార్ నిజాయితీగా ఆ సాహ‌సం చేశారు. ప‌ల్లె జీవితాల్లోని మాధుర్యాన్ని, స్వ‌చ్ఛ‌మైన మ‌న‌సుల్ని, అక్క‌డి ప్ర‌జ‌ల అమాయ‌క‌త్వాన్ని, తిరుగుబాటుత‌త్వాన్ని  హృద్యంగా వెండితెర‌పై దృశ్య‌మానం చేశారు.

రంగస్థ‌లం అనే ఊరిలో జ‌రిగే క‌థ ఇది. ఆ ఊరికి చెందిన చిట్టిబాబు (రామ్‌చ‌ర‌ణ్‌) మోటారు ద్వారా పంట‌చేల‌కు నీరును అందించే ప‌ని చేస్తుంటాడు. ఎదుటివారికి స‌హాయ‌ప‌డాల‌నే మంచి గుణం అత‌డిది.  ఆ మ‌న‌స్త‌త్వ‌మే ఊరంద‌రూ అత‌డిని అభిమానించేలా చేస్తుంది. పుట్టుక‌తోనే అత‌డికి చెవుడు ఉంటుంది. త‌న‌కున్న వైక‌ల్యం ఎదుటివారికి తెలియ‌కుండా ఉండ‌టానికి చాలా తంటాలు ప‌డుతుంటాడు. కుటుంబంతో పాటు అన్న‌య్య కుమార్‌బాబు (ఆదిపినిశెట్టి) చిట్టిబాబుకు ప్రాణం. ఆ ఊరిని ముప్ఫై ఏళ్లుగా పోటీయే లేకుండా ప్రెసిడెంట్‌గా ఏలుతుంటాడు ఫ‌ణీంద్ర‌భూప‌తి (జ‌గ‌ప‌తిబాబు). ప్ర‌జ‌ల క‌ష్టార్జితాన్ని దోచుకుంటుంటాడు. ఎదురు తిరిగిన వారిని చంపుతాడు.  అత‌డి అన్యాయాల్ని కుమార్‌బాబు ఎదురిస్తాడు. ఫ‌ణీంద్ర‌భూప‌తిపై ఎన్నిక‌ల్లో పోటీకి నిల‌బ‌డ‌తాడు.అన్న‌య్య‌కు చిట్టిబాబు అండ‌గా నిల‌బ‌డ‌తాడు.  కుమార్‌బాబు మంచిత‌నం వ‌ల్ల ఊరంద‌రూ అత‌డి ప‌క్ష‌ాన నిల‌బ‌డ‌తారు. దాంతో ఎన్నిక‌ల్లో ఓట‌మి ఎదుర‌వుతుంద‌నే భ‌యంతో ఫ‌ణీంద్ర‌భూప‌తి అత‌డిని చంప‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తాడు. ఆ విష‌యం తెలుసుకున్న చిట్టిబాబు అన్న‌య్య‌ను కాపాడుకునేందుకు ఏం చేశాడు. రంగ‌స్థ‌లం ఊరికి ఎలా న్యాయం చేశాడు, తాను ప్రాణంగా ప్రేమించిన రామ‌ల‌క్ష్మి( స‌మంత‌)ను పెళ్లిచేసుకున్నాడా,  త‌న కుటుంబానికి జ‌రిగిన అన్యాయంపై ప్ర‌తీకారం ఏ విధంగా తీర్చుకున్నాడున్న‌దే ఈ చిత్ర క‌థ‌.

ఊరికి, అన్న‌య్య‌కు జ‌రిగిన అన్యాయంపై ప్ర‌తీకారం తీర్చుకునే ఓ త‌మ్ముడి క‌థ ఇది.  అంద‌రికి తెలిసిన‌ క‌థే అయినా దానిని మ‌న‌సుల్ని హ‌త్తుకునేలా అందంగా తెర‌పై చూపించారు ద‌ర్శ‌కుడు సుకుమార్‌. ఈ సినిమా రూప‌క‌ల్ప‌న‌లో పూర్తి క్రెడిట్ అత‌డికే ద‌క్కుతుంది. సాంకేతిక‌త‌, హీరోయిజం, ఆరు పాట‌లు, ఫైట్స్ అనే మూస‌ధోర‌ణికి అల‌వాటుప‌డిపోయిన ప్రేక్ష‌కుల్ని ఈ సినిమాతో గ‌త‌కాలంలోకి తీసుకెళ్లారు. ఆనాటి ప‌ల్లెటూరి సంస్కృతుల్ని, వేష‌భాష‌ల్ని, స్వ‌చ్ఛ‌మైన మ‌నుషుల్ని  ఈ సినిమా ద్వారా చూపించారు. మ‌రుగున ప‌డిపోతున్న ఎన్నో క‌ళారూపాల గొప్ప‌త‌నాన్ని ఈసినిమా ద్వారా మ‌రోసారి గుర్తుచేశారు.

పూరిల్లు, పెంకుటిల్లు, పంట‌చేలు, శ్రామిక సౌంద‌ర్యం, క‌ట్టు, బొట్టు, ప‌ల్లెవాత‌వ‌ర‌ణాన్ని స‌హ‌జ‌త్వం ఉట్టిప‌డేలా ఎలాంటి సాంకేతిక హంగుల‌కు తావులేకుండా య‌దార్థం కోణంలో  ఆవిష్క‌రించిన తీరు మెప్పిస్తుంది. లంగా ఓణీలు, లుంగీ, గ‌ళ్ల‌చొక్కాలు, పాత‌కాలం మిద్దెలు ప్ర‌తీదీ 1980 కాలం నాటి రోజుల్ని గుర్తుకుతెస్తుంది. క‌ళ్ల‌ముందు య‌దార్థ జీవితాల్ని చూస్తున్న అనుభూతిని క‌లిగిస్తుంది. చిట్టిబాబు ఆహార్యం,  అత‌డు చేసే ప‌నులు అన్ని నిజంగా ప‌ల్లెటూళ్లో ఇలాంటి మ‌నుషులు ఉంటారేమోన‌న్న ఊహ‌ను రేక‌త్తిస్తుంది. ఒక ఊరిలో కొద్ది పాత్ర‌ల చుట్టే జ‌రిగే క‌థ‌ను ఎక్క‌డ బిగి స‌డ‌ల‌కుండా ఉత్కంఠ‌భ‌రితంగా చూపించారు. క‌థ‌లో ప‌ల్లె సౌంద‌ర్యాన్ని మిళితం చేసిన తీరు మెప్పిస్తుంది, ముఖ్యంగా అక్క‌డి రాజ‌కీయాలు, ఊరి పెద్ద ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఉండే భ‌య‌భ‌క్తుల్ని ఉన్న‌ది ఉన్న‌ట్టుగా చెప్ప‌డం బాగుంది.

త‌న‌దైన మ్యాజిక్‌తో ప‌తాక ఘ‌ట్టాల‌ను ఉత్కంఠ‌గా ముగించిన తీరు బాగుంది. ప్ర‌తి ఫ్రేమ్ ద‌ర్శ‌కుడిగా సుకుమార్ ప్ర‌తిభ‌కు తార్కాణంగా నిలుస్తుంది. అత‌డి కెరీర్‌లోనే ఉత్త‌మ చిత్రంగా రంగ‌స్థ‌లం నిలుస్తుంది. స‌గ‌టు ప‌ల్లెటూరి యువ‌కుడిగా రామ్‌చ‌ర‌ణ్ అద్వితీయ అభిన‌యాన్ని క‌న‌బ‌రిచారు. త‌న కెరీర్‌లోనే ఉత్త‌మ‌మైన న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించిన చిత్ర‌మిది.  ప్ర‌జ‌ల‌కు స‌హాయ‌ప‌డే మంచివాడు, ప్రేమికుడిగా, కుటుంబం, అన్న‌య్య మంచి కోరే వ్య‌క్తిగా భిన్న పార్శ్వ‌ాల్లో సాగే పాత్ర‌కు ప్రాణం పోశారు. చెవిటి వ్య‌క్తిగా రామ్‌చ‌ర‌ణ్ క‌నిపించే స‌న్నివేశాల‌న్ని న‌వ్విస్తాయి. ఈ పాత్ర కోసం త‌న యాస‌, ఆహార్యాన్ని పూర్తిగా మార్చుకొని న‌టించారు. గ‌డ్డం, లుంగీ, పూల చొక్కాల‌తో ప‌ల్లెటూరి యాస‌లో అత‌డు చెప్పే సంభాష‌ణ‌లు ఆక‌ట్టుంటాయి. విరామ స‌న్నివేశాల‌కు ముందు వ‌చ్చే స‌న్నివేశం, ప‌తాక ఘ‌ట్టాల్లో ప‌రిణతితో కూడిన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచారు. అత‌డిలోని హీరోయిజాన్ని ప‌తాక స్థాయిలో ద‌ర్శ‌కుడు సుకుమార్ ఈ సినిమాలో చూపించారు. రామ‌ల‌క్ష్మిగా స‌మంత స‌హ‌జ న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించింది. పొలం ప‌నులు చేసుకుంటూ బ‌తికే స‌గ‌టు ప‌ల్లెటూరి యువ‌తుల్ని గుర్తుకుతెచ్చ‌లా ద‌ర్శ‌కుడు సుకుమార్ ఆమె పాత్ర‌ను అందంగా తీర్చిదిద్దారు. కుమార్‌బాబుగా ఆదిపినిశెట్టి న‌ట‌న బాగుంది.

అధికార దాహం క‌లిగిన ప‌ల్లెటూరి ప్రెసిడెంట్‌గా జ‌గ‌ప‌తిబాబు క‌ళ్ల‌తోనే చ‌క్క‌టి విల‌నిజాన్ని పండించారు. పైకి పెద్ద‌మ‌నిషిగా క‌నిపిస్తూ కుతంత్రాల‌కు పాల్ప‌డే అగ్ర‌కుల నాయ‌కుడిగా ప్ర‌కాష్‌రాజ్ పాత్ర స‌గ‌టు రాజ‌కీయ నాయ‌కుల్ని త‌ల‌పిస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌త్యేక గీతాలు, గ్లామ‌ర్ హంగుల‌తో కూడిన అతిథి పాత్ర‌ల్లో ఎక్కువ‌గా క‌నిపించిన అన‌సూయలో దాగివున్న న‌ట‌నా ప్ర‌తిభ‌ను వెండితెర‌పై  చూపించిన సినిమా ఇది. రంగ‌మ్మ‌త్త‌గా ఆమె ప‌లికించే ఎమోష‌న్స్ మ‌న‌సుల్ని కదిలిస్తాయి. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ న‌ట‌న‌తో సినిమాకు ప్రాణంపోశారు.

న‌టీన‌టుల ప్ర‌తిభ‌తో పాటు  సాంకేతిక విభాగం ప‌నితీరు అద్భుతంగా కుదిరింది. జాన‌ప‌ద శైలిలో చంద్ర‌బోస్ అందించిన సాహిత్యం ఆనాటి కాలాన్ని గుర్తుకుతెచ్చింది. ప‌ల్లెటూరి  అందాల‌ను ఉన్న‌ది ఉన్న‌ట్లుగా త‌న కెమెరాలో బంధించారు కెమెరామెన్ ర‌త్న‌వేలు. రామ‌కృష్ణ‌, మోనిక వేసిన సెట్‌లో నిజంగా రంగ‌స్థ‌లం పేరుతో ఓ గ్రామం ఉంద‌నే అనుభూతిని క‌లిగిస్తాయి. త‌న శైలికి భిన్నంగా బాణీలు, నేప‌థ్య సంగీతంతో ఆక‌ట్టుకున్నారు దేవిశ్రీ‌ప్ర‌సాద్‌. రొటీన్‌కు భిన్న‌మైన కొత్త త‌ర‌హా క‌థ‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించాల‌నే నిర్మాత‌ల ప్ర‌య‌త్నం నిజంగా అభినంద‌నీయం.

మాన‌వ జీవితాల్లోని సంఘ‌ర్ష‌ణ‌ను  రియ‌లిస్టిక్‌గా ఆవిష్క‌రించిన చ‌క్క‌టి సినిమా ఇది. మ‌ర‌చిపోయిన గ‌త కాల వైభ‌వాన్ని మ‌రోసారి గుర్తుచేయ‌డ‌మే కాకుండా ఆ రోజుల్లో అంద‌రిని విహ‌రించేలా చేస్తుంది. ప‌ల్లెవీధుల్లో న‌డ‌యాడిన అనుభూతిని క‌లిగిస్తుంది. నిజాయితీతో వినూత్న‌మైన ఫీల్‌గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు సుకుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రం త‌ప్ప‌కుండా ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సుల్ని ఆక‌ట్టుకుంటుంది

రేటింగ్‌:3.5/5