పాకిస్తాన్‌లో భారత రాయబారికి అవమానం - MicTv.in - Telugu News
mictv telugu

పాకిస్తాన్‌లో భారత రాయబారికి అవమానం

March 2, 2018

భారత్‌పై పాకిస్తాన్‌కు విద్యేషం ఎప్పటికీ తగ్గదని ఈ ఉదంతం మరోమారు రుజువు చేస్తోంది. భారత రాయబారికి ఓ ప్రతిష్టాత్మక క్లబ్‌లో సభ్యత్వం ఇవ్వకుండా తాత్సారం చేస్తూ అవమానిస్తోది.  గత డిసెంబర్‌లో అజయ్‌ బిసారియా పాకిస్తాన్‌లో భారత రాయబారిగా బాధ్యతలు చేపట్టారు.  బిసారియా సంప్రదాయం ప్రకారం ఇస్లామాబాద్‌ క్లబ్‌ మెంబర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నెలలు గడుస్తున్నప్పటికీ పాక్‌ అధికారులు ఆయనకు సభ్యత్వం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. భారత రాయబారుల కార్యకలాపాలపై ఆంక్షలు విధించాలన్న ఉద్దేశంలోనే పాక్‌ ఈ రీతిగా వ్యవహరిస్తోంది. అజయ్‌ బిసారియాను ఉద్దేశపూర్వకంగా అవమానించింది.

పలు దేశాల ఉన్నతాధికారులు, రాయబారులు సభ్యులుగా ఉండే ఇస్లామాబాద్‌ క్లబ్‌లో బిసారియా చేరకుండా అడ్డుకునేయత్నం చేసింది. కొంతకాలంగా సరిహద్దులో వరుస కాల్పులు, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్‌ తాజా చర్యకు ఒడిగట్టింది. సాధారణంగా ఒకటి రెండు రోజుల్లో ముగిసే ప్రక్రియను నెలలు గడుస్తున్నా వాయిదా వేస్తూ వచ్చింది. గతంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు ఎంత దెబ్బతిన్నా ఇలా ఎప్పుడూ జరగలేదు.

భారత్‌లో పాక్‌ రాయబారిగా సోహైల్‌ మొహమ్మద్‌ ( గతేడాది మే )లో నియమితులైన సంగతి తెలిసిందే.  వేర్పాటువాద నేతలతో వరుస భేటీలు నిర్వహించి వివాదాస్పదుడిగా పేరుపొందిన అబ్దుల్‌ బాసిత్‌ పదవీ విరమణ అనంతరం సోహైల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. భారత ప్రభుత్వం అతనిపై కొన్ని ఆంక్షలు విధించింది. ఢిల్లీ శివారు నోయిడా, గురుగ్రామ్‌లలో పర్యటనకు ఆయనను అనుమతించడంలేదు. దీంతో పాకిస్తాన్‌ కూడా బిసారియాపై పగ సాధింపు ఆంక్షలకు తెరలేపింది.

ఇస్లామాబాద్‌ క్లబ్‌ : 

350 ఎకరాల సువిశాల ప్రాగణంలో గోల్ఫ్‌, స్విమ్మింగ్‌, రెస్టారెంట్‌ సహా సకల సదుపాయాలుంటాయి ఈ క్లబ్‌లో . పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో రాయబార కార్యాలయాలకు సమీపంగా వుంటుంది. పాక్‌లో పనిచేసే అన్ని దేశాల రాయబారులు, వారి కుటుంబాలు, అత్యున్నతాధికారులకు అదొక రిక్రియేషన్. ఏ దేశం నుంచైనా కొత్తగా రాయబారి నియమితులయ్యారంటే, గంటల వ్యవధిలోనే ఆ క్లబ్‌లో మెంబర్‌ కావడం రివాజుగా వస్తోంది. అలా ఇస్లామాబాద్‌ క్లబ్‌ రాయబారుల అడ్డాగా పేరుపొందింది.