విశాఖ ఉక్కులో నిలిచిపోనున్న ఉత్పత్తి! - MicTv.in - Telugu News
mictv telugu

విశాఖ ఉక్కులో నిలిచిపోనున్న ఉత్పత్తి!

November 30, 2017

విశాఖ ఉక్కు కర్మాగారానికి ముడి ఇనుము సమస్య తలెత్తింది. ఈ కర్మాగారానికి ఆరంభం నుంచి ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌ఎండీసీయే ఐరన్‌ ఓర్‌ను సరఫరా చేస్తోంది. కిరండోల్‌ సమీప బైలదిల్లా, బచేలి గనుల నుంచి వచ్చే ఐరన్‌ ఓర్‌ కోరాపుట్, బొర్రా, కొత్తవలసల మీదుగా స్టీల్‌ప్లాంట్‌ చేరుతుండేది. ఎప్పుడూ నెలరోజుల ఉత్పత్తికి సరిపడే ఐరన్‌ ఓర్‌ నిల్వ ఉండేది. కొండచరియలు విరిగిపడడంతో అక్టోబర్‌ 7 నుంచి కేకే లైన్‌లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రభావం పర్యాటకులకంటే స్టీల్‌ప్లాంట్‌పైనే ఎక్కువగా పడింది. కేకేలైన్‌ ప్రమాదంతో ఈ మార్గంలో ఐరన్‌ ఓర్‌ రవాణా నిలిచిపోయింది. ఉత్పత్తికి విఘాతం కలగకుండా ఎప్పుడూ నెలరోజులకు సరిపడా నిల్వ వుండేది. ప్రస్తుతమున్న స్టాక్ రెండ్రోజులకు కూడా సరిపోదు. ఈ రోజు ర్యాక్‌ వస్తే సరి.. లేకుంటే లేదన్నట్టుగా పరిస్థితి తయారైంది. దీంతో ఏ క్షణాన ఉత్పత్తి ఆపేయాల్సి వస్తుందోనని స్టీల్‌ప్లాంట్‌ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితి స్టీల్‌ప్లాంట్‌కు గతంలో ఎన్నడూ ఎదురవలేదు. హుద్‌హుద్‌ సమయంలో.. ఆ తర్వాత నీటికొరత వల్ల ఉత్పత్తిలో స్వల్ప బ్రేకులు పడ్డాయి. ముడి ఇనుము కొరతతో ఉత్పత్తి ఆపేయాల్సిన దుస్థితి ఇప్పుడే ఏర్పడింది.

ఉక్కు యాజమాన్యం విజ్ఞప్తి మేరకు రైల్వేశాఖ ప్రత్యామ్నాయంగా రాయగడ, పార్వతీపురం, విజయనగరంల మీదుగా సరుకు రవాణా ప్రారంభించింది. దీంతో ఆ మార్గంలో రద్దీ మరింత పెరగడంతో రోజుకు ఒక ర్యాక్‌ రావడం గగనమైంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని జగదల్‌పూర్‌ సమీపంలో ఎన్‌ఎండీసీ నిర్మిస్తున్న స్టీల్‌ప్లాంట్‌ నుంచి తాత్కాలిక ప్రాతిపదికన ఐరన్‌ ఓర్‌ రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అది ఎంతవరకు ఫలిస్తుందో వేచిచూడాలి.