బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న ఉపేంద్ర ? - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న ఉపేంద్ర ?

March 6, 2018

గతేడాది పార్టీని ప్రారంభించిన కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్రకు సొంత పార్టీ నుండి తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని తెలుస్తోంది. అయితే ఆయన పార్టీకి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు జరపడం లేదని ఓ నియంతలాగా ప్రవర్తిస్తున్నారని ఆయన పార్టీకి చెందిన నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపేంద్ర పార్టీని రద్దు చేసే యోచనలో వున్నట్టు తెలుస్తోంది. పార్టీ రద్దు చేశాక ఉపేంద్ర భాజాపాలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంగళవారం ఉపేంద్ర భాజపాలో చేరుతున్నారని, ప్రధాని నరేంద్రమోదీ విధానాలు నచ్చడంతో ఆయనతో చేతులు కలుపుతున్నారని మరి కొందరు చెబుతున్నారు. దీని గురించి ఆయన మార్చి 6న తనకు అగ్ని పరీక్ష రోజు అని పెట్టిన ట్వీట్‌ ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్‌ సోమవారం ఓ మీడియాతో ఈ విషయం గురించి మాట్లాడారు. ‘ ఉపేంద్ర ఎంతపెద్ద సినీస్టార్ అయినప్పటికీ పార్టీని పట్టించుకోవాలి కదా. కార్యకర్తల పట్ల ఆయన నియంతలా వ్యవహరించడం ఎవరికీ నచ్చటం లేదు. అందుకే పార్టీలో ఆయనపై తిరుగుబాటు మొదలైంది. మరో రెండు నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఆయన మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారు. మామాట అస్సలు పట్టించుకోవడంలేదు. ఎన్నికలకు సంబంధించి ఎటువంటి మేనిఫెస్టోని రూపొందించిలేదు. మేము ఏదైనా ప్రశ్నిస్తే మా మాట వినరు. కనీసం స్పందిచరు కూడా. ఆయన ప్రవర్తనపై పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ’ అని తెలిపారు.

కాగా శివకుమార్ ఆరోపణలు నిరాధారమైనవని ఉపేంద్ర ప్రతినిధి ఆనంద్ అన్నారు. ఉపేంద్ర అంటే గిట్టనివాళ్లు ఈ విష ప్రచారానికి పూనుకున్నారన్నారు. ‘ రాత్రికి రాత్రే రాజకీయాల్లో మార్పు రావాలనే అతివాదులు వాళ్ళు. అలాంటివాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోవద్దు ’ అని ఆనంద్‌ పేర్కొన్నారు.