హిందువుల స్థలం.. సిక్కుల ధనం.. ముస్లింల శ్రమ.. శభాష్! - MicTv.in - Telugu News
mictv telugu

హిందువుల స్థలం.. సిక్కుల ధనం.. ముస్లింల శ్రమ.. శభాష్!

February 28, 2018

గొప్ప మత సామరస్యానికి, ప్రజాస్వామ్యానికి, లౌకికత్వానికి నిదర్శనంగా నిలబడుతోంది ఓ గ్రామం. అక్కడ ఓ మసీదు నిర్మాణంలో ఇతర మతస్తులు పాలు పంచుకొని కులమతాలతో కుమ్ములాడుకునేవారికి ఆదర్శంగా నిలిచారు. మసీదు నిర్మాణం కోసం బ్రాహ్మణులు స్థలం ఇవ్వగా, దాని నిర్మాణానికి సిక్కులు డబ్బులు ఇవ్వటమే కాకుండా మసీదు నిర్మాణానికి శ్రమదానం కూడా చేస్తూ తమ సహృదయతను చాటుకున్నారు. మూమ్ అనే ఈ ఆదర్శ గ్రామం పంజాబ్‌లోని బర్నాలా జిల్లాలో వుంది.ఈ మసీదు నిర్మాణ పనులను దగ్గరుండి చూసుకుంటున్న 40 ఏళ్ల నజీమ్‌ఖాన్ మాట్లాడుతూ… ‘ మసీదు నిర్మాణం కోసం బాబా మోమిన్ షా మందిరంలో ప్రార్థనలు చేస్తున్నాం. మా ప్రార్థన ఫలించింది. పండిట్ బిరదారీ కొంత స్థలాన్ని మసీదు కోసం దానం చేయటంతో మేము నిర్మాణాన్ని మొదలుపెట్టాం. వారు స్థలాన్ని ఇవ్వడమే కాకుండా మసీదు నిర్మాణానికి తమ వంతుగా శ్రమదానం చేస్తున్నారు. పెద్ద మనసుతో డబ్బులు కూడా ఇస్తున్నారు. వారి సహృదయతకు సదా కృతజ్ఞుడిని ’  అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఈ మసీదు నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆయుర్వేద వైద్యుడు పండిట్ పురుషోత్తం లాల్ మాట్లాడుతూ ‘ రాజకీయ నేతలే ప్రజల మధ్య కులమతాల చిచ్చు రగిలిస్తున్నారు. ఈ దేశంలో రాజకీయం అనేది ఒక్కటి లేకుండా వుండుంటే ప్రతీ గ్రామంలో అన్య మతాల వారందరూ ఎంతో అన్యోన్యంగా కలిసి వుండేవారు. నాయకులు ఓట్ల కోసం ప్రజల మధ్య వైషమ్యాలను తీసుకొస్తున్నారు. కానీ మా గ్రామం అలాంటివారి వలలో పడదు. దాదాపు 300 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ గ్రామానికి మతం మచ్చ అనేది వుండదు. ఇక్కడ అందరం అన్నదమ్ముల్లలా కలిసి మెలిసి వుంటాం. ఓ పంజాబీగా, తమకు సంబంధించినంత వరకు మతాలకు అతీతంగా అందరూ సమానమే అనుకుంటాము ’ అని చెప్పారు.