ఈ దేశం ఆ రెండు పార్టీల కోసమే కాదు.. కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఈ దేశం ఆ రెండు పార్టీల కోసమే కాదు.. కేటీఆర్

March 8, 2018

‘భారతదేశం కేవలం  కాంగ్రెస్, బీజేపీల కోసమే కాదు,  బలమైన వ్యవస్థ కలిగిన ప్రాంతీయ పార్టీలు ఈ దేశంలో చాలా ఉన్నాయి’ అని  తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ‘టైమ్స్‌నౌ’ చానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో అన్నారు.  మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలతో విసిగి పోయిన మిత్ర పక్షాలు ఒక్కొక్కటిగా బీజేపీకి  టాటా చెప్పాలని చూస్తున్నాయని. దీనికి నిదర్శనం బీజేపీ మిత్ర పక్షమైన టీడీపీ కేంద్రంలోని మంత్రులతో రాజీనామా చేయించడమే’ అని ఆయన అన్నారు.‘బీజేపీ, కాంగ్రెస్  రెండు పార్టీలు కూడా ప్రజల ఆకాంక్ష మేరకు నడుచుకోవడం లేదు. అంతేకాదు బీజేపీ సర్కారుపై  పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు. మా రాష్ట్రానికి కూడా బీజేపీ సర్కార్ ప్రత్యేక హోదా ఇవ్వబోమని తెేల్చి చెప్పిందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ అసహనం వ్యక్తం చేయగా, శివసేన ఎన్డీఏకు  టాటా చెప్పడం మరియు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మోదీ సర్కారు తీరుపై మండిపడడం ఇవన్ని చూస్తుంటే దేశంలో మూడో ప్రత్యామ్నాయం వచ్చే అవకాశం ఉంది. మోదీ సర్కారుకు బీటలు పడుతున్న సంకేతాలే ఇవన్నీ అని విశ్లేషకులు కూడా అంటున్నారు’ అని  కేటీఆర్ అన్నారు.

నేతల మాటలు, దేశంలో జరుగుతున్న పరిణామాలు  చూస్తుంటే దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు  రాబోతున్నాయో, ఎవరి దారి ఎటు వైపో, ఎవరికి ఎవరు మిత్రులో  ఇలా చాలా సందేహాలకు సమాధానాల కోసం పలు పార్టీల్లో ఉన్న నేతలే కాదు ఇటు ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు.