mictv telugu

జగన్ సారూ అంతా బాగానే ఉంది… ఆ ఒక్కటే కాస్త చూడండి….

January 10, 2019

పాదయాత్రలు చేయడంలో  కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న జగన్ మరో  రికార్డు క్రియేట్ చేసి సుదీర్ఘ పాదయాత్రను ముగించారు.  శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఏర్పాటు చేసిన ముగింపు బహిరంగ సభలో ఆయన చాలా విషయాల గురించి మాట్లాడారు. పదేపదే ప్రస్తావించిన మాట నవరత్నాలు. అన్న వస్తున్నాడు… నవరత్నాలు  తెస్తున్నాడని వైసీపీ నాయకులు ఎప్పటి నుండో ప్రచారం చేస్తున్నారు. ముగింపు సభలో కూడా జగన్ దీని గురించి ప్రస్తావించారు. ఏపీ ప్రజల జీవితాలు మారేందుకే నవరత్నాలు తెస్తున్నట్లు చెప్పారు.

సభకు జనం భారీగా వచ్చారు. సభలకు….జనం అంటే  జగన్ సభలనే స్థాయికి వెళ్లింది పరిస్థితి. అంత మంది స్వచ్చందంగా వస్తున్నారో… లేకపోతే తరలి వస్తున్నారో తెలియదు. కానీ, ముగింపు సభకు ఓ రేంజ్‌లో ప్రజలు వచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది.  జగన్ బాబు చెప్పిన నవరత్నాల్లో ఒక రత్నం మాత్రం చాలా ఇబ్బందులతో కూడుకుని ఉన్నది. మిగిలిన రత్నాలకు ఓట్లు రాల్చే శక్తి చాలానే ఉంది. కాకపోతే మద్యనిషేధం అనే రత్నం ప్రజలకు అందించడం సాధ్యమా అనే సందేహాలు వస్తున్నాయి.

Telugu news Jagan is all right thats the only thing you see .... ..

రైతులు, కూలీలు, వృద్ధులు, మహిళలు, చదువులు ఇలా తొమ్మిది అంశాలకు నిధులు, అమలు  వంటి హామీలిచ్చారు జగన్. అందులో మద్యనిషేధం కూడా ఉంది. గత పాలకులు మద్యనిషేధం గురించి మాట్లాడారు.  ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రామారావు దాన్ని అమలు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు దాన్ని ఎత్తేశారు. జగన్ ఇప్పుడు దాన్నే ఎత్తుకున్నారు.

రాష్ట్ర  బడ్జెట్‌కు  ఎట్లా లేదన్నా పదిహేను వేల కోట్ల వరకు మద్దతునిచ్చే సువర్ణావకాశాన్ని జగన్ వదులుకుంటే చాలా ఇబ్బంది అవుతుందనేవారూ ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఈ నవరత్నాలు  జగన్ బాబును గెలిపిస్తాయని వైసీపీ నాయకులు అంటున్నారు. ఈమధ్య కాలంలో జగన్ సభలకు వస్తున్న జనాలే అందుకు సాక్ష్యం అని అంటున్నారు. ఏ నాయకునికీ రానంత స్థాయిలో జనం వస్తున్నారని, వాటిని ఓట్లుగా మలుచుకుంటే జగన్  గెలుపు సులువని అంటున్నారు.

ఇక జగన్ స్పీచ్ విషయానికొస్తే చంద్రబాబు నాయుడు గురించి తారాస్థాయిలో విమర్శలు చేశారు. జనాల నుండి స్పందనా అలాగే ఉంది. చివరి సభ కావడంతో జనాలు భారీగానే వచ్చారు. ఇచ్చాపురం  రోడ్లన్నీ జనాలతో నిండిపోయాయి. రాజకీయంగా జగన్ మాట్లాడుతున్నప్పుడు మాంచి స్పందన వచ్చింది. ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరుకున్నారు. నేను మీ గుండె చప్పుడు విన్నాను… నా గుండె చప్పుడుగా మార్చుకున్నాను. అని చెప్పిన  డైలాగ్ బాగానే పేలింది.

నెలల తరబడి సాగిన పాదయాత్రకు ఏర్పాట్లు బాగానే ఉన్నా… అన్ని సభలకు వచ్చినట్లుగానే జనం బాగానే వచ్చారు. అయితే జగన్ పార్టీ నాయకులు ఈ యాత్ర కష్టాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకుంటారా. లేకపోతే  అధికార పక్షం చేసే విమర్శలు, చంద్రబాబు నాయుడు రాజేస్తున్న సెంటిమెంట్ ముందు నిలబడి తట్టుకుని ఓట్లు, సీట్లు సంపాదించి అధికారంలోకి వస్తారా అనే వాటిపై ఏపీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

Telugu news Jagan is all right ... that's the only thing you see ....