అసెంబ్లీ రద్దు.. రెండు కూటములకూ గవర్నర్ షాక్  

జమ్మూకశ్మీర్లో ఈ రోజు హైడ్రామా రాజకీయాలు నడిచాయి. రాజకీయ అనిశ్చితి తొలిగిపోతుందని వచ్చిన సంకేతాలు చివరికి అసెంబ్లీ రద్దుకు దారితీశాయి. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పీడీపీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్సుల కూటమి…, బీజేపీతో కలసి తాము ఏర్పాటు చేస్తామని జేకే పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజాద్ లోన్ ముందుకు రాగా, గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఏకంగా అసెంబ్లీనే రద్దు చేసి పడేశారు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్‌కు ఫ్యాక్స్ ద్వారా లేఖ పంపేందుకు యత్నించగా, అటువైపు ఫ్యాక్స్ మిషన్ మొరాయించిందని పీడీపీ నేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తెలిపారు. పోస్టు ద్వారా కూడా లేఖ పంపామని, అయితే గవర్నర్ ఏకంగా అసెంబ్లీ రద్దు చేశారని మండిపడ్డారు. పీడీపీ సారథ్యంలోని కూటమి సర్కారును ఏర్పాటు చేస్తే పార్టీ సీనియర్ నాయకుడు అల్తాఫ్ బుఖారి సీఎం అవుతారని అంతకుముందు ఊహాగానాలు వినిపించాయి. బుఖారీ.. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లాతో భేటీ కావడంతో సర్కారు ఏర్పాటయినట్లేనని భావించారు. 87 సీట్లున్న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి 2016లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు.

28 సీట్లు తెచ్చుకున్న పీడీపీ, 25 సీట్లు గెలిచిన బీజేపీతో కలసి సర్కారును ఏర్పాటు చేసింది. ముఫ్తీ సీఎం అయ్యారు. తర్వాత శాంతిభద్రతలపై కీచులాట మొదలై రాష్ట్రపతి పాలనకు దారితీసింది. వచ్చే నెల 19తో దాని గడువు ముగియనుండడంతో పార్టీలు మళ్లీ సర్కారు ఏర్పాటుకు యత్నించాయి. రద్దయిన అసెంబ్లీల్లో పీడీపీకి 28 మంది, నేషనల్ కాన్ఫరెన్సకు 15 మంది, కాంగ్రెస్కు 12 మంది ఉండడంతో మేజిక్ ఫిగరైన 44కు సరిపడా బలముందని భావించారు.

Telugu news Jammu Kashmir Assembly Dissolved After Bids By “Grand Alliance” vs Sajad Lone + BJPMehbooba Mufti said she will stake claim to form a government with the support of National Conference and Congress. Sajad Lone said he the support of BJP.