స్థల వివాదంలో ‘జనసేన’ - MicTv.in - Telugu News
mictv telugu

స్థల వివాదంలో ‘జనసేన’

December 14, 2017

ఇటీవల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చినకాకానిలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన కొద్దిరోజులకే స్థలవివాదం చుట్టుముట్టుకున్నది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని చినకాకానిలో జనసేన పార్టీ కార్యాలయం నిర్మించాలని, అందుకు సంబంధించిన పనులు మొదలవుతాయనగా ఈ వివాదం చెలరేగింది. యార్లగడ్డ సుబ్బారావు వారసుల నుంచి జనసేన పార్టీ తీసుకున్న లీజుకు చట్ట బద్దత లేదంటూ, ఆ స్థలం వారసులుగా వున్న మైనారిటీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ స్థలం యార్లగడ్డ సుబ్బారావుది కాదని, ముస్లిం ఐక్యవేదిక పేర్కొంది. మొహియుద్దీన్‌కు చెందిన ఆ స్థలాన్ని పవన్‌కు లీజుకు ఇచ్చే అధికారం సుబ్బారావుకు లేదని ముస్లిం ఐక్యవేదిక చెబుతున్నది. దీనిపై మొహియుద్దీన్ కుటుంబసభ్యులు పవన్‌కు తెలియజేసినా ఆయన ఇంకా స్పందించట్లేదని, తన భూమిని అన్యాయంగా లీజుకు తీసుకున్న జనసేన పార్టీపై న్యాయపోరాటం చేస్తానంటున్నారు.కాగా ఈ స్థల వివాదంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. చినకాకాని వద్ద కార్యాలయం నిర్మించేందుకు జనసేన పార్టీ కోశాధికారి రాఘవయ్య భూమి హక్కుదారులతో అవగాహన ఒప్పందం చేసుకున్నారని సమాచారం. యార్లగడ్డ సుబ్బారావు, సాంబశివరావు, అంకినీడు ప్రసాద్‌కు చెందినదిగా 3.42 ఎకరాల భూమిని మూడేళ్ల పాటు అద్దెకు తీసుకున్నారని, నెలకు ఎకరాకు రూ.50వేల చొప్పున చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.