mictv telugu

పాలేరు బతుకులో పన్నీటివాన .. జంగయ్య…

July 12, 2018

పాలబుగ్గల జీతగాడా..

పసుల గాసె మొనగాడా..

పాలు మరసీ ఎన్నాళ్ళయ్యిందో..

కొలువు కుదిరి ఎన్నెళ్లయ్యిందో..

Telugu news, Jangaiah, Open University, story

-ఇదీ జంగయ్య జీవితపు నేపథ్య గీతం. పాలుగారే ఆరేళ్ల పసితనంలోనే, పసుల మందలో పడిన జంగయ్యకు.. జీతం అప్పు జమా ఖర్చుల్లో మిగిలింది పన్నేండళ్ల వెట్టిచాకిరికి తాకట్టుపడ్డ జీవితం. వెట్టి కట్టుబాట్లను ఒక్కొక్కొటిగా తెంపేసుకుంటూ చదువు సాయంతో జీవితపు ఒక్కో మొట్టు ఎక్కి ఎదిగిన జంగయ్య ఇవాళ ఒక విశ్వవిద్యాలయ ఉద్యోగి. రంగారెడ్డి జిల్లాకు చెందిన జంగయ్యను కదిపితే చెమర్చే ఆయన కళ్ళల్లో పశువుల మందలో కరిగిపోయిన బాల్యం కనిపిస్తుంది. ప్రతి మాటలో అచంచల ఆత్మవిశ్వాసంతో ఆయన వేసిన అడుగుల సవ్వడి వినిపిస్తుంది. జీవితంలో పద్దెనిమిదేళ్ల దాకా పాలేరుగా ఉన్న ఆయన ఇవాళ ఎంఏ పట్టాదారు. బాల్యమంతా చేతిలో ముల్లుగర్రే తప్ప పలకా బలపం పట్టి ఎరుగని జంగయ్య డా. బి.ఆర్ ఆంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఏ, ఎంఏ పూర్తి చేసి ఒక సామాజిక శాస్త్రవేత్తగానో, సంఘ సేవకుడిగానో మారి తన ఊరిలో తనలాంటి వారి బతుకు రాత మార్చాలని కలలు కంటున్నాడు. అడుగడునా అవమానాల పాలై తిట్లు, ఛీత్కారాలు, కర్ర దెబ్బలకు కమిలిపోయిన బాల్యాన్నీ, బాధల్నీ తడుముకుంటూనే చదువు నేర్పిన సాహసంతో తన కలల్ని సాకారం చేసుకుంటున్నాడు. ఎండల్లో  ఎండిపోయి వానల్లో తడిసిపోయిన పల్లే దాటి తుమ్మచెట్ల ముళ్లబాటలు దాటి, అక్షరం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో ఆ ఊరికి ఒక కొత్త దారి చూపిన జంగయ్య ప్రస్థానాన్ని ఆయన మాటల్లోనే విందాం.

‘మా అమ్మానాన్న లక్ష్మీ, బీరయ్యలు. మాది రంగారెడ్డి జిల్లా కీసర మండలం, చీర్యాల గ్రామం. మా అమ్మనాన్నలకు ఎనిమిది  మందిమిపుట్టాం. ఇద్దరు దుర్భర పేదరికానికి బలయ్యారు. ఆరుగురం మిగిలాం. నేను నాలుగో వాడిని.పేరుకు రాజధాని పక్కనేకానీ అక్షరానికి  నోచుకోని ఊరు మాది. ఇక నా చిన్నప్పుడు చదువనేదే ఎరుగం. ఎందుకంటే బతకడానికి జీతం చేయడమే సరిపోయింది. జీతమంటే నెలనెల డబ్బులొచ్చే ఉద్యోగం కాదు. వెట్టి,మేకలు గొర్రల దగ్గర కావలి. మా నాయన అదే చేసేవాడు. మా అన్న అదే చేసేవాడు. నాదీ అదే పని . ఆరేళ్లకే గొంగడి వేసుకుని, కాళ్లకు చెప్పలు లేకుండా పొలాలు, కంచెలు వెంబడి పశువులను మేపే పనికి కుదిరాను. సంవత్సరానికి యాభై రూపాయల జీతం. పటేల్ దగ్గర ఇంతా చేసీ జీతం మిలిగిలేదేమీ లేదు. ఇల్లు గడవడానికి, అప్పులు తీర్చడానికి చాకిరీ ….వెట్టిచాకిరి. ఇదంతా బతుకు గడవడానికే. మా అయ్య వెనుకనే అన్న….ఆయన వెనుకనే నేను, నా తమ్ముడు.. అంతా జీతగాళ్లమే. చారెడు చెక్క భూమిలేదు. వ్యవసాయం లేదు. అయితే జీతం లేకుంటే కూలి. ఆరేళ్ల వయస్సులోనే  జీతానికి కుదిరిన నేను 18ఏళ్లదాకా అంటే పన్నేండెళ్లు పటేళ్ల దగ్గర జీతానికి పనిచేశాను. దుర్భరమైన పని. కాళ్లకు చెప్పులు. నెత్తిన గొంగడి ….పనికి పెట్టుకున్న పటేళ్ళే ఇవ్వాలి. అవి అడిగే ధైర్యం మాకు లేదు. ఇచ్చే కనికరం వాళ్ళకు లేదు. ఎండైనా, వానైనా ఉత్తకాళ్ళతోనే. ఒంటిపై సరిగ్గా బట్టలు ఉండేవికావు. బాల్యం సగం చిగురులే. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే పుట్టెడు దారిద్య్రం, సగం ఎండిన డొక్క సగం నిండిన కడుపు చదువుకు ఎలా దూరం చేశాయో చెప్పడానికే. బతకడానికి చాకిరీ చేసే జీవితాల్లో చదువు గురించి ఆలోచన రావడమే ఒక సాహసం.

ఆ దెబ్బలు మర్చిపోలేదు…

నాకప్పుడు తొమ్మిదేళ్ళు ఉంటాయేమో.  ఓ పటేల్ దగ్గర పనిచేసేవాడిని. పటేల్ తమ్ముడి పొలం కూడా పక్కనే ఉండేది. వారి మధ్య గొడవలుండేవి. అన్న దగ్గర జీతం ఉన్న నేను పశువులను మేపేవాడిని. ఓసారి నా దగ్గర మందలో దుడ్డె పటేల్  తమ్ముడి చేనులో పడింది. నిజానికి అది చేనులో మేయలేదు. చేనులోంచి వెళ్లిందంతే. అప్పుడు పటేల్ తమ్ముడు కొట్టాడు. ఇప్పటికీ మరచిపోను ఆ దెబ్బలు, వాతలూ. మా ఊరిలో కూడా చాలామందికి ఇంకా గుర్తు. ఇది అన్యాయం అన్నవాడు ఒక్కడూ లేడు. ఇప్పుడు మా ఊరికి వెళ్తే ఆ పటేల్‌ని తమ్ముడని పలుకరిస్తా…బాగున్నావా తాతా అని తలదించుకుంటాడాయన. పశువులన్ని మేపడం చాలా కష్టమైనపని. చిన్న చిన్న పిల్లలే చేస్తుంటారా పని. వర్షం పడుతుంటే … ముళ్ళ కంచెల్లో పశువులు పరుగెతుతుంటే  కన్నుమూసి తెరచేలోగా చేలలోపడి మేస్తుంటే ….నానా యాతన. పశువులకేం తెలుసు ఎటు వెళ్లాలో. ఒక్క రోజు జ్వరం వచ్చి పడుకున్నా పటేల్ ఊరుకునేవాడు కాదు. బూతులు ,దెబ్బలు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఏడు గంటలదాకా పనే. ఎండొచ్చినా, వానొచ్చినా !

చదువు నా స్వప్నం…

ఎందుకో నాకు చిన్నప్పటి నుంచీ చదువుంటే మహాఇష్టం. నేను పనిచేసే పటేళ్ల పిల్లలు చదువుకునేవారు. నాకూ అలా చదువుకోవాలనిపించేది. రాత్రి బడికి పొవడానికి ప్రయత్నం చేసేవాడిని. పశువుల్ని మేపుకు వచ్చి, వాటిని కట్టేసి పేడతీసి పాలు పిండి… అప్పటికే రాత్రయ్యేది. ఒళ్ళు పులిసిపోయి ఉండేది. అయినా రాత్రి బడికి పోయేవాణ్ణి. ‘అనియత  విద్య’ నడుస్తుండేది మా ఊర్లో. కొద్ది రోజులు అక్కడ చదువు. అది పద్నాలుగేళ్ళు లోపు ఉన్నవారికే. నా వయస్సు మించిపోవడంతో అక్కడికి రానివ్వలేదు. వచ్చిన నాలుగు అక్షరాలకు మళ్లీ ఆటంకం. ఆ తరువాత కొన్నాళ్లు వయోజన విద్య మొదలయింది. మా ఊర్లో మళ్లీ చదువు మొదలుపెట్టాను. అందరూ నవ్వే వాళ్ళు….ఎద్దులా ఉన్నావ్. ఏం చదువు అని. రాత్రి రహస్యంగా వెళ్ళేవాడిని చదువుకోవడానికి.

దరిద్రంలో ఉండేవాడికి కావల్సినన్ని అవరోధాలు. 1984లో మా నాన్నను ఎవరో చంపేశారు. జీవితాంతం పశువుల మధ్యే గడిపిన ఆయన పశువుల మందకాడే చనిపోయాడు. ఊర్లో ఏవో తగాదాలు. అదే మా కుటుంబానికి షాక్. దానిపై మరో షాక్. ఆ కేసులో మా అన్నను పోలీసులు అరెస్టు చేసి తీసుకు వెళ్ళడం. రెండేళ్ళు జైలులో ఉన్నాడు. ఆ తర్వాత వదిలేశారు. అమ్మ బెదిరిపోయింది.ఈ క్రమంలో పేదరికం మరింత పెరిగింది. కుటుంబ భారం అంతా నాపైనే. ఇలా జీవితంలో ప్రతి సంఘటనా నన్ను చదువుకు దూరం చేస్తూనే ఉంది.

మలుపు తిరిగిన జీవితం…

మెగసెసె అవార్డే గ్రహీత శాంతా సిన్హా 1987లో మా ఊరికి వచ్చారు. నా జీవితాన్ని మలుపుతిప్పిన సంఘటన అది. మా గ్రామంలో వెట్టిచాకిరిలో మగ్గుతున్న వారికి విముక్తి కల్పించేందుకు ఆమె ఎంతో శ్రమించారు. ఎన్నో కష్టాలకు ఓర్చారు. అక్కడ పటేళ్ళే అనేక ఇబ్బందులను సృష్టించేవారు. రోజూ వాదోపవాదాలు జరిగేవి. అవమానించేవారు. అన్నిభరించి నాలాంటి బాలకార్మికులకు విముక్తి కల్పించి హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీకి తీసుకువచ్చారు. అక్కడ నర్సరీలో శిక్షణనిచ్చారు. మెక్కలు పెంచడం… అందరం కలిసి యూనివర్సిటీలోనే ఉండేవాళ్లం. షెడ్డు వేయించారు…

బియ్యం కూరగాయలు అన్ని ఇప్పించేవారు.. వండుకుని తిని, పని నేర్చుకునేవాళ్ళం. శాంతాసిన్హా అక్కడితో అగలేదు. తన దగ్గరి విద్యార్థులను మా వద్దకు పంపించేవారు. చదువు చెప్పడానికి శ్రీనివాస్, ఆంజనేయులు రవీంద్రబాబు వారందరూ మా దగ్గరకు వచ్చి చదువు చెప్పేవారు. మళ్ళీ  అక్షరాలతో సహచర్యం .ఇంతలోనే శిక్షణ పూర్తయింది. పనేతే నేర్చుకున్నాం. కానీ బతకడం ఎలా. మళ్ళీ ఇంటికి వెళ్ళాం. పూట గడవడం కష్టం అయింది.

మళ్ళీ శాంతాసిన్హా చల్లని చేతులే ఆశ్రయమిచ్చాయి. మా అందరిని హైదరాబాద్ పిలిపించి సెంట్రల్ యూనివర్సీటిలోనే పని ఇప్పించారు. రోజుకు 18 రూపాయలు.. దినసరి కూలి. 15 మందిమి చేరాం. తర్వాత పెళ్ళిళ్ళు,  కుటుంబ సమస్యలు. అందరూ మానేశారు. ముగ్గురమే మిగిలాం. మా అదృష్టవశాత్తూ ఐదో పే కమిషన్ వచ్చింది. మేం దినసరి వేతనంలోంచి స్కేలులోకి మారాం.18 రూపాయల దినసరి నుంచి 1800 రూపాయల నెలజీతం. జీవితం ఒక కొత్త దారిలో పడింది. ఆ తర్వాత పర్మనెంట్ అయింది. కృష్ణమూర్తి గారు చాన్సలర్ అయ్యాక మళ్ళీ మాకు చదువు అబ్బింది. యూనివర్సీటీలో ఎవ్వరూ వేలిముద్రగాళ్ళ ఉండకూడదనే నిర్ణయంలో భోజన విరామ సమయంలోమాకు చదువు చెప్పించారు. అలా అప్పుడప్పుడు మాకు సరస్వతి కటాక్షం దొరుతూ వచ్చింది.

స్వీపర్‌గా ఉండి…

యూనివర్సీటీలో శానిటేషన్‌లో స్వీపర్‌గా పనిచేసేటప్పుడు విద్యార్థులు పరిచయం అయ్యేవారు. వారితో మాట్లాడడం, చదువు గురించి మాట్లాడడం. చదువుపై ఆసక్తి పెరిగింది. మధ్యాహ్నపు చదువులో మాకు ‘సర్టిఫికెట్’ ఇచ్చారు. దానితో టెన్త్ పరీక్ష రాయాలన్న ఆలోచన వచ్చింది. 1991లో మొదటిసారి పరీక్షరాశా. ఫెయిల్ అయ్యా. అలా ఎన్నో సార్లు పరీక్ష రాశా. ఒక్కసారే  అన్ని పాస్ కావాలని అన్ని ఫ్రెష్‌గా రాసేవాణ్ణి. అలా 1993లో టెన్త్ గట్టెక్కాను.

టెన్త్ పాసవడం కొంత ఉత్సహాన్ని ఇచ్చింది. ఆ వెంటనే 1994లో అంబేద్కర్ ఓపెన్ వర్సీటీలో డిగ్రీలో ఎంట్రన్స్ రాశాను. ఫస్ట్ క్లాస్ వచ్చింది. డిగ్రీలో చేరాను. ఆ తర్వాత పెళ్ళైంది. నా సిస్టర్స్ ,బ్రదర్స్ మ్యారేజీ బాధ్యత నాదే. నేనే వారి పెళ్ళిళ్ళు చేశాను. అలా కొంతకాలం చదువు అటకెక్కింది. చెప్పాగా.. బతుకు పోరులో చదువు సజావుగా సాగడం ఎంతో కష్టమని. మొత్తానికి ఎలాగైతేనేం 2000 సంవత్సరం నాటికి డిగ్రీ పూర్తి  చేయగాలిగాను. సమాజం గురించీ, మనుషుల గురించీ, మా బతుకుల గురించీ నా బాల్యం గురించీ బాగా ఆలోచనలు ఉండేవి. వీటన్నింటిపై ఆధ్యయనం చేయాలంటే సోషియాలజీ చదవాలని యూనివర్సీటి స్టూడెంట్స్ అంటుండేవారు. ఎలాగైనా సోషియాలజీ చదవాలనుకున్నా. 2003లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సీటీలో ఎంఏ సోషియాలజీ మొదలుపెట్టాను. ఫస్ట్ బ్యాచ్ లో చేరాను. ఇక్కడో విషయం చెప్పాలి. అంబేద్కర్ యూనివర్సీటిలో నిర్వహించే కాంటాక్ట్ క్లాసులు బాగా లేకుండేవి. నేను డిగ్రీ చదివేటప్పుడు యూనివర్సీటీ హస్టల్‌లో పనిచేసేవాడిని. ఆదివారం విద్యార్థులకు స్పెషల్ చేసి పెట్టాలి. ఆ రోజు బాగా బిజీగా ఉంటుంది. సెలవులు పెట్టడం అసలు కుదరదు. నాకు పని ముఖ్యం. దాని తర్వాతే ఏదైనా. అదేకదా మనకు తిండిపెడుతోంది. చదువుకునే అవకాశం కల్పిస్తోంది.అలా కాంటాక్ట్ క్లాసులకు వెళ్ళడం కుదిరేది కాదు. నేనే సొంతంగా చదువునేవాడిని. అర్థం కాకపోతే మా యూనివర్సిటీ విద్యార్థులు సాయం చేసేవారు. ఈ విషయంలో వారికి నేనెంతో రుణపడి ఉన్నాను.

అక్షరానికి అభినందన…

మా మేడమ్ శాంతాసిన్హా మెగసెసె అవార్డు వచ్చింది. ఆ సందర్బంగా సెంట్రల్ యూనివర్సిటీలో సన్మానం ఏర్పాటుచేశారు. మా జీవితాలను మార్చేసిన ఆమె గురించి నాలుగు మాటలు మాట్లాడాలని చాలా అలనిపించింది. దానికోసం బాగా ప్రయత్నించా .పెద్ద సభ. పెద్ద వాళ్ళంతా వస్తారు. అవకాశం దొరుకుతుందా అనిపించింది. చివరికి పుష్ఫగుచ్ఛం అయినా ఇవ్వాలని తాపత్రయపడ్డా. మొత్తానికి శాంతాసిన్హానే కలిసి నా కోరిక చెప్పా. ఆమె వైస్ చాన్సలర్‌తో మాట్లాడి  రెండు నిమిషాల సమయం ఇప్పించారు. సభ అయిపోవచ్చింది. చివర రెండు నిమిషాలు నేను మాట్లాడాను. దాదాపు 500 మంది ఉన్నారు. అంతా పెద్దవాళ్ళ . మాజీ వైస్ చాన్సలర్లు ,మేధావులు హాలంతా నిండిపోయి ఉంది. భయం భయంగానే నాకథంతా చెప్పా. శాంతాసిన్హా ఎలా సాయం చేశారో…మా జీవితాలు ఎలా మార్చారో చెప్పాను. ఉద్వేగం ఆపుకోలేక అక్కడే ఏడ్చేశా. అందరూ శ్రద్ధగా విన్నారు. నా మాటలు వింటారని నేను ఊహించలేదు. మాట్లాడి కిందకు దిగుతుంటే చప్పట్లు.  కొందరు చేతులు కలిపి అభినందించారు. కొందరు తమ గుండెలకు హత్తుకుని ఆశ్వీర్వదించారు. నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని అపూర్వమైన సంఘటన అది. చదువు ఇంత ఆనందాన్ని తెచ్చిపెడుతుందా అనిపించింది. అందరూ నన్ను గుర్తించారు. అభినందిచారు. ఆశీర్వదించారు. చదువును సమాజం గుర్తిస్తుందని నాకు తెలియజెప్పిన మొదటి సంఘటన అది.

నా బాటలో నా భార్య కూడా…

ఆనాటి నుంచి నాకు చదువు రుచి తెలిసింది. ఆ ఉత్సాహంలో ఎన్ని  అడ్డంకులు వచ్చినా కష్టపడి చదివా. ఎంఏ సోషియాలజీ ఫస్ట్ ఇయర్‌లో డిస్టింక్షన్ వచ్చింది. రెండో సంవత్సరంలో 65 శాతం మార్కులతో  పాసయ్యాను. ఇక చదువును వదిలిపెట్టదలచుకోలేదు. ఎంఫిల్, పీహెచ్‌డీ చేయాలన్న కోరిక ఉంది. దానికి కాస్త ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. కానీ నాకదే కష్టం. తెలుగైతే ఎలాగోలా కష్టపడి అర్ధం చేసుకున్నా. కానీ ఇంగ్లీష్ నేర్చకోవడం కష్టమతోంది. ఇప్పుడిప్పుడే ఇంగ్లీష్‌పై శ్రద్ధ పెట్టాను. ఇప్పడు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యంలో ఎంఏ  చేస్తున్నాను. జీవితాంతం చదువుతూనే ఉండాలన్నదే నా కోరిక. చిన్నప్పుడు అవకాశం లేదు. ఇప్పుడు నేర్చుకోవాలన్న తపన. శ్రామిక విద్యాపీఠం నుంచి కంప్యూటర్ చేశా. 93 శాతం మార్కులతో పాసయ్యాను. ఎప్పటికైనా పీహెచ్‌డీ చేయాలన్నదే నా లక్ష్యం.సెంట్రల్ యూనివర్సిటీ శానిటేషన్ గెస్ట్‌హౌస్, హాస్టల్‌లో పనిచేసిన నేను ఇప్పుడు ఎకనామిక్స్ విభాగంలో అటెండర్‌గా పని చేస్తున్నాను. డిపార్ట్‌‌మెంట్  పరీక్షలు రాసి ఇంకా పైకి ఎదగాలని ప్రయత్నం. ఒకసారి సంసారంలో పడ్డాక చదువుకోవడం చాలా కష్టం. నాకు ఒక పాప, ఒక బాబు. ఇప్పడు ముగ్గురం కలసి చదువుకుంటున్నాం. ఇంగ్లీష్‌లో నాకు తెలియనవి పాప చెబుతూ ఉంటుంది. అప్పుడు నాకు గర్వంగా, ఆనందంగా ఉంటుంది. నా కథ వారికి చెప్పి బాగా చదువుకోవాలని ప్రోత్సహిస్తుంటాను. వాళ్లేకాదు. నా సహ ఉద్యోగులు చాలామందిని అంబేద్కర్ యూనివర్సిటీలో చేర్పించాను. బాల్యంలో బడికి వేళ్లలేని  మా జీవితాల్లో అంబేద్కర్ యూనివర్సిటీ గొప్ప మార్పును తెస్తోంది. చదువునే మా దగ్గరికి తెస్తోంది. ఇంకేం కావాలి. ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకొవాలని అందరికీ చెబుతుంటాను. మా ఆవిడను కూడా చేర్పించా. ఆమె ఇప్పుడు డిగ్రీ చేస్తోంది.

చదువిచ్చిన గౌరవం…

నా బాల్యం  ఊరు, ఆ తిప్పలు గుర్తుకు వస్తే ఆ బాధగా ఉంటుంది. నాలాంటి వాళ్ళ  ఎంతో మంది ఉన్నారు. అప్పుడు శాంతాసిన్హాలాగా ఎవరైనా సాయం చేస్తేనే బయటపడుతారు. నేను బాగా సెటిలైతే వారికి ఏమైనా చెయ్యాలని అనిపిస్తోంది. ఏదైనా ఎన్జీవో  ఏర్పాటు చేయాలనుంటుంది. చేయాలనుంటుంది. నేను స్థిరపడ్డాక తప్పకుండా ఏదైనా సాయం చేస్తా. ఇప్పుడు ఊరికి వెళితే నన్ను ఎంతో గౌరవిస్తారు, రాజధాని దగ్గరగా ఉందనే కానీ మా ఊర్లో టెన్త్ పాసైతే గొప్ప. చదువులో అంతగా వెనుకబడి ఉంటుంది. నన్ను అప్పుడు జీతానికి పెట్టుకున్నవారే ఇప్పుడు గుర్తిస్తారు,  గౌరవిస్తారు. ఎంఏ పాసైయ్యాడని, ఉద్యోగం చేస్తున్నాడని మర్యాద చేస్తారు. నలుగురికి స్పూర్తిగా నన్ను చూపుతారు. ఇదంతా నాకు ఆనందంగా ఉంటుంది. చదువు నాకిచ్చిన గౌరవం ఇది.

మా నాన్న ఉంటే బాగుండేది…

ఇప్పుడు మా ఊరి నుంచి నాకు ఫోన్లు వస్తుంటాయి. మా పిల్లవాడు టెన్త్ పాసయ్యాడు, తర్వాత ఏం చేయిస్తే బావుంటుందని నన్ను సలహలు అడుగుతుంటారు. పద్దెనిమిదేళ్ళు అక్షరజ్ఞానం లేకుండా  పెరిగిన నేను ఇప్పుడు  చదువు గురించి సలహాలు ఇస్తున్నాను. ఇది తలచుకుంటే నాకు గమ్మత్తుగా, గర్వంగా ఉంటుంది. మా నాయన బతికి ఉంటే ఎంతో ఆనందపడేవాడు. చిన్నప్పడు ఆయన మమల్ని ఎంత బాగా చూసేవాడో. ఆయన తినే పిడికెడంత తిండిలో మాకు కడుపులు నింపడానికి మిగిల్చేవాడు. చాలాసార్లు మేం తిన్నాకే తినేవాడు. ఇంత ఇబ్బందుల్లో కూడా ఎంతో ప్రేమ. అప్పలు చేసి తీర్చడానికి నానా యాతనపడేవాడేకానీ కడుపులు మాడనిచ్చేవాడు కాదు. నిజానికి  అప్పుడు తినడానికేముండేది. జొన్న గటక రోట్టే కలిపి తిని బతికాం. ఇప్పటి నా జీవితం చూస్తే ఆయన ఎంతో ఆనందపడేవాడు.

అదెంతో ఉపయోగం…

అంబేద్కర్ యూనివర్సిటీలో మెటీరియల్ ఈజీగా ఉన్నా ఎంతో స్టాండర్డ్‌గా ఉంటుంది. అది చదివిన వారు ఎంతో మంది సివిల్స్ రాశారు. నేను కూడా గ్రూప్ -1, గ్రూప్ -2 లు ప్రయత్నం చేశా. అలాంటివి ప్రిపేర్ కావాలంటే చాలా సమయం కావాలి. నా ఉద్యోగ సమయం అయిపోయాక నాలుగు గంటలు సమయం మిగులుతుంది. కుటుంబ సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. వాటిలోనే సమయం మిగుల్చుకుని చదువుతుంటాను. రోజుకు కనీసం  రెండు గంటలైనా చదవాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. పిల్లలతో పాటు చదువుకోవడం అదో తృప్తి. చదువు రుచి దొరికింది. ఒకసారి దొరికాక చదువు వదిలేయడం కష్టం. కాస్త సమయం దొరికినా లైబ్రరీలో గడుపుతాను. సెంట్రల్ యూనివర్సిటీలో అమ్యూలమైన పుస్తకాలున్నాయి. నిజానికి రెండేళ్ళ సెలవుపెట్టి బాగా చదవాలన్నది కోరిక. ఇంకా అధికారుల దృష్టికి తీసుకెళ్లలేదు. ఆర్థిక విషయాలు కూడా చూసుకోవాలికదా! ఎంత కష్టమైనా సరే చదవడం మాత్రం ఆపను. ఇక్కడితో ఆగను. ‌

(మేము సైతం.. సార్వత్రిక విద్యార్థుల విజయగాథలు- ఘంటా చక్రపాణి పుస్తకం నుంచి)