శోభన్‌బాబుతో జయ సహజీవనం నిజమే - MicTv.in - Telugu News
mictv telugu

శోభన్‌బాబుతో జయ సహజీవనం నిజమే

December 4, 2017

‘ నేను జయ కూతురినే, కావాలంటే డీఎన్ఏ పరీక్షలకు సిద్ధం ’ అంటూ బెంగుళూరుకు చెందిన అమృత  సుప్రీంకోర్టు మెట్లెక్కిన విషయం విదితమే. కాగా ఇప్పుడు జయ మరణం తరువాత ఆమె వ్యక్తిగత జీవితంపై అనేక కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా జయ, శోభన్ బాబుల బంధం గురించి ‘ స్టార్ అండ్ స్టైల్ ’ అనే ఆంగ్ల పత్రికలో 1979లో  ప్రచురితమైన ఓ కథనం గురించి చర్చ జరుగుతున్నది. ఆ కథనానికి స్పందిస్తూ అప్పట్లో జయ సదరు పత్రికకు ఘాటుగా లేఖ రాశారు. ‘ పత్రికా విలేఖరి మా రహస్య దాంపత్యంపై అయోమయంలో వున్నట్టు అనిపిస్తోంది. మేమిద్దరం           ‘ గోయింగ్ స్టడీ ’ గాఢమైన అనుబంధాన్ని కలిగివున్నాం. ఈ బంధం జీవితాంతం కొనసాగుతుంది ’ అని తేల్చి చెప్పింది.  తమ మధ్యనున్న బంధాన్ని తానెప్పుడూ దాచి పెట్టలేదని, సినిమాల్లో మునుపటిలా నటిస్తుంటే ఇమేజ్ కోసం దాచి పెట్టి వుండేదానినని  అని కూడా వివరించింది. జయ ఆంగ్లంలో రాసిన ఈ ఉత్తరాన్ని తమిళంలోకి అనువదించి ‘ కుముదం ’ అనే తమిళ వార పత్రిక ప్రచురించటం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

కుముదం వార పత్రిక విలేఖరిని జయ తన వద్దకు రప్పించుకుని    ‘ నాకూ, శోభన్ బాబుకు మధ్య వున్న బంధం చాలా పవిత్రమైంది. తాళి కడితేనే పవిత్రమైన బంధం అంటారా? ఏ ఆడదీ పెళ్ళైన మగాడిని ఉద్దేశపూరితంగా ప్రేమించదు. తనకు అండగా వున్న వ్యక్తిని కోరుకుంటున్నాను. ఆయనతో వున్న స్నేహబంధం కాస్త పవిత్ర బంధంగా మారింది. ఇందులో ఆయనను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. నేనాయనను కలుసుకునేటప్పటికి ఆయన వివాహితుడు. ఆయన భార్యకు విడాకులిప్పించి ఇద్దరూ పెళ్ళి చేసుకోవచ్చు కదా అని చాలా మంది అడుగుతున్నారు. అది సముచితం కాదు. ఎందుకంటే ఏ పాపం తెలియని ఆమెకు విడాకులిప్పించి ఆమె జీవితాన్ని నాశనం చెయ్యటం భావ్యం కాదు కదా… అని మౌనంగా వున్నాను’ అని చెప్పిందట. దీంతో వారిద్దరి రహస్య జీవితంపై అప్పట్లో విభిన్న కథనాలు వెలుగు చూశాయి.

జయ రాజకీయాల్లోకి రావటంతో వారి బంధం ముగిసింది

చాలాకాలం కొనసాగిన జయ, శోభన్‌ బంధం ఎంజీఆర్‌ జోక్యంతో ముగిసిపోయిందని పత్రికల్లో పెద్ద ఎత్తున కథనాలు ప్రచురితమయ్యాయి. 1982లో మళ్లీ ఎంజీఆర్‌కు జయ చేరువయ్యారు. తిరిగొచ్చిన జయకు ఎంజీఆర్‌ రాజకీయంగా మంచి ప్రాధాన్యం కల్పించారు. రాజకీయాల్లో బిజీగా మారటంతో శోభన్‌బాబు ఆమె జ్ఞాపకాల నుంచి శాశ్వతంగా దూరమైపోయారు. జయ రాజకీయాల్లో ఎదుగుతున్నప్పుడు శోభన్‌బాబుతో ఆమె బంధం గురించి 1989లో డీఎంకే పార్టీ పత్రిక ‘ మురసొలి ’ నాలుగు పేజీల కథనాన్ని ఫొటోలతో సహా ప్రచురించింది. ఆ ఫొటోలు ఇరువురినీ దంపతులుగా తలపించే రీతిలో ఉన్నాయి.

అమృత జయ కూతురునని నిరూపించుకుంటుందా ?

ఇదిలా వుండగా అమృత పిటిషన్‌ను సుప్రీంకోర్ట్ కర్ణాటక హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది. సుప్రీంకోర్టులో అమృత దాఖలు చేసిన పిటిషన్‌ ప్రకారం.. 1980 ఆగస్టు 14న జయలలిత, అమృతకు జన్మనిచ్చారు. తన పెంపుడు తల్లి శైలజ 2015లో మరణించిందని, తండ్రి ఈ ఏడాది మార్చి 20న మృతి చెందాడని, జయలలిత బతికున్నప్పుడు కుమార్తెనని ప్రకటించుకుంటే ఆమె కీర్తి ప్రతిష్ఠలు దిగజారుతాయని ఆ రహస్యాన్ని దాచి పెట్టానని అమృత తెలిపారు. కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ వేయడానికి ఆమె సిద్ధమవుతున్నారు. జయకు బిడ్డ ఉన్న మాట వాస్తవమేనని ఆమె మేనత్త కూతురు లలిత కూడా ఇటీవల వెల్లడించారు. దివంగత తెలుగు సినీనటుడు శోభన్‌బాబు, జయలలితదాంపత్య ఫలితంగానే తాను జన్మించానని అమృత చెబుతున్న నేపథ్యంలో జయ, శోభన్‌బాబు మధ్య బంధం మరోసారి చర్చనీయాంశమైంది.