కన్నయ్యపై రాజద్రోహం కేసు.. 1200 పేజీలు ట్రంకుపెట్టెలో..

ట్రంకు పెట్టె నిండా చార్జీషీట్ పత్రాలు మోసుకొచ్చారు ఢిల్లీ పోలీసులు. పది మంది నిందితులపై దాఖలుచేసిన ఈ చార్జిషీట్ మొత్తం 1200 పేజీలు ఉంది. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ పోలీసులు పాటియాలా కోర్టుకు అందజేశారు. మూడేళ్ల క్రితం.. 2016 ఫిబ్రవరిలో ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) స్టూడెంట్ లీడర్స్ కన్నయ్య కుమార్, ఉమర్ ఖలీద్ సహా మరి కొందరిపై రాజద్రోహం కేసు పెట్టారు ఢిల్లీ పోలీసులు. ఆ కేసుకు సంబంధించిన చార్జిషీటును ఇలా ట్రంకు పెట్టెలో మోసుకొచ్చారు పోలీసులు.

పార్లమెంటుపై దాడి చేసిన ఉగ్రవాది అఫ్జల్ గురు ఉరిని వ్యతిరేకిస్తూ JNUలో విద్యార్థి నాయకులు కన్నయ్య, ఖలీద్ నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దేశానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. దేశానికి వ్యతిరేకంగా వేర్వేరు రాష్ట్రాల్లో ప్రసంగాలు చేశారు. విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేశారని అభియోగాలు నమోదయ్యాయి.

ఈ కేసులో కన్నయ్య కుమార్, ఉమర్ ఖలీద్ అనిర్బన్ భట్టాచార్య, సీపీఐ నేత డి.రాజా కుమార్తె అపరాజిత, అఖిబ్ హుస్సేన్, ముజీబ్ హుస్సేన్, బషీర్ భట్, మునీబ్ హుస్సేన్, ఉమర్ గుల్, షీలా రషీద్, రసూల్‌పై అభియోగాలను నమోదు చేశారు. తాము పెట్టిన అభియోగాలకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.

124(ఏ) – రాజద్రోహం, ఐపీసీ 471 – పోర్జరీ డాక్యుమెంట్లను నిజమైనవిగా నమ్మించే ప్రయత్నం, ఐపీసీ 323 – విధ్వంసానికి కారణం అవ్వడం,  ఐపీసీ 147 – అల్లర్లు చేయడం, ఐపీసీ 465 – ఫోర్జరీ, ఐపీసీ 143 – చట్ట వ్యతిరేక అంశాలపై సమావేశం, ఐసీపీ 120బీ – నేర పూరిత కుట్ర సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

మోదీకి థాంక్స్ చెప్పిన కన్నయ్య

ఇదిలావుండా తనపై మూడేళ్ల క్రితం పెట్టిన కేసు చార్జిషీటును ఇప్పుడు ఎన్నికల సమయంలో ఫైల్ చేయడం రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసు అని కన్నయ్య కుమార్ అన్నారు. దీనిపై తాను మోదీ, పోలీసులకు తన థ్యాంక్స్ చెప్పారు. తనకు భారతదేశంలోని కోర్టులపై నమ్మకం ఉందని అన్నారు.

Telugu news JNU sedition row: Kanhaiya Kumar, Umar Khalid raised anti-India slogans, says 1,200-page charge sheet