కూతురిగా నన్ను అంగీకరించు నాన్నా..! - MicTv.in - Telugu News
mictv telugu

కూతురిగా నన్ను అంగీకరించు నాన్నా..!

September 8, 2017

ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ నగరంలోని సాయిధామ్ గుడి ముందు బిఏ ఫైనలియర్ చదువుకుంటున్న కాజల్ అరోరా అనే అమ్మాయి భిక్షం ఎత్తుకున్నది. అదీ చేతిలో ఫ్లకార్డు పట్టుకొని. దాని మీద నేను ఫలానా దిల్ బాగ్ పాన్ మసాలా అధినేత దిల్ బాగ్ అరోరా యొక్క మనవరాలిని అని రాసి వుంది. తనతో తన తల్లి కూడా వుంది. చదువుకున్న అమ్మాయి, అందులోనూ కోటీశ్వరుడి మనవరాలు డబ్బులు అడుక్కోవడమా అని ఆశ్యర్యపోకండి. తను అడుక్కుంటున్నది డబ్బులు కాదు న్యాయాన్ని. ఇంతకూ తనక్కావాల్సిన న్యాయం ఏంటంటే.. తన తల్లి రీతూ అరోరా దిల్ బాగ్ పాన్ మసాలా వారి ఇంటి కోడలు అని చెప్పి అందర్నీ షాక్ కు గురి చేసింది. తన తండ్రి అయినటువంటి అరుణ్ అరోరా 1994 లో తన తల్లిని పెళ్ళి చేస్కుని, రెండేళ్ళకే విడాకులిచ్చేసి వదిలించుకున్నాడు. అప్పటికే తను జన్మించిందట.

అప్పట్లో విడాకులిస్తూ కంపన్సేషన్ కింద 2 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ఆ తర్వాత మరో ముగ్గురు మహిళలను పెళ్ళి చేస్కొని వాళ్ళకు కూడా తన తల్లిలాగే విడాకులిచ్చేసాడు. కూతురిగా నన్ను గుర్తించు నాన్నా అంటూ అర్థిస్తోంది ఈ కూతురు. ఇప్పుడు 57 ఏళ్ళ వయసులో ఐదో పెళ్ళికి సిద్ధమయ్యాడని తెలుసుకున్న కాజల్ తండ్రి మీద యుద్దానికి సిద్ధమైంది. తొలుత తన తండ్రి ఫోన్ నెంబరు కనుక్కొని ఫోన్ చేసింది. నా పేరు కాజల్, నేను మీ కూతురునని చెప్పిందట. అప్పుడా తండ్రి కాస్త కూడా పితృవాత్సల్యం చూపకుండా అయితే ఏంటని ? మాట్లాడాడట. నాకు నీ వయసున్న అమ్మాయైతే ఐదో పెళ్ళి చేస్కుంటానని దురుసుగా మాట్లాడేసరికి కూతురికి చిర్రెత్తుకొచ్చి ఇలా యుద్ధానికి దిగిందని చెప్తోంది. నాన్న అమ్మను వదిలేసాక అమ్మ నా పాలన కోసం ఎంతో శ్రమించింది. పేరుకు బిడ్డల్ని కని వదిలించుకోవడం మగతనం అనుకుంటున్నారు మా నాన్న లాంటి మగాళ్ళు. అలాంటి మగాళ్ళందరికీ నేను సవాల్ విసురుతున్నానని చెప్పింది.

ఆయన కూతురిగా నన్ను గుర్తించి ఆస్తిలో నా వాటా నాకివ్వాలని వాదిస్తోంది. అమ్మ రీతూ మాట్లాడుతూ.. మాది కాన్పూర్ లోని సాకేత్ నగరం. మా నాన్న జ్ఞానేంద్ర జోహార్ కస్టమ్ ఇన్ స్పెక్టర్ గా రిటైరయ్యారు. తర్వాత దిల్ బాగ్ పాన్ మసాల్ కంపెనీలో మేనేజరుగా జాయినయ్యాడు. అక్కడ దిల్ బాగ్ కు తనకు పరిచయం పెరిగి స్నేహంగా మారింది. ఆ క్రమంలో ఆవారాగా తిరుగుతున్న తన కొడుకు సుదురాయించడానికి పెళ్ళే మార్గమనుకొని జ్ఞానేంద్ర కూతుర్నైన నన్ను అరుణ్ అరోరాకిచ్చి పెళ్ళి చేసారు. పెళ్ళైన రెండేళ్ళకే విడాకులిచ్చి వదిలించుకున్నాడని చెప్పింది. ఈ విషయం కోర్టు వరక్కూడా వెళ్ళింది. నాన్న తనను తన కూతురుగా అంగీకరించే వరకు తన ఈ పోరాటం ఆగదు అంటోంది. కాజల్ డీఎన్ ఏ పరిశీలించాక జరగాల్సిన న్యాయం గురించి ఆలోచిస్తామని కాన్పూర్ కోర్టు తెలిపింది. కాజల్ లాంటి ఎందరో అభాగ్యులు తండ్రుల గెంటివేతకు శాపాలుగా మారి బతుకులీడుస్తున్నారు. చాలా మంది మగాళ్ళు అభం శుభం తెలియని పసి పిల్లలను వదిలించుకుంటున్నారు. కాజల్ కు న్యాయం జరిగితే ఎందరో దుర్మార్గ తండ్రులకు చెంపపెట్టు లాంటి గుణపాఠం అవుతుంది.