దారుణం.. భార్య నాలుక కోసేసి.. ఇంట్లో నిర్బంధించి..

కట్టుకున్న భార్యను కంటికిరెప్పలా చూసుకోవాల్సిన భర్తే అతిక్రూరంగా ప్రవర్తించాడు. అదనపు కట్నం తీసుకురావడం లేదని భార్య నాలుకను కోసేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ కాన్పూర్ జిల్లాలోని బర్రా ఏరియాలో చోటు చేసుకుంది.

ఆకాశ్ అనే వ్యక్తి తన భార్యను అదనపు కట్నం తీసుకురావాలని కొద్దిరోజులుగా వేధిస్తున్నాడు. తరచూ కట్నం కోసం వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే నవంబర్ 6వ తేదీన ఈ వివాదం తారా స్థాయికి చేరింది. ఆగ్రహానికి గురైన ఆకాశ్ తన భార్య నాలుకను కోసేశాడు. విషయం బయటకు వెళ్లకుండా భార్యను 10 రోజులు ఇంట్లోనే నిర్బంధించాడు.

ఇంట్లో చిత్రహింసలు భరించిన ఆమె తన తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయం తెలిపింది. దీంతో కూతురు ఇంటికి వెళ్లిన ఆయన వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స నిర్వహించిన వైద్యులు ఆమె నాలుకకు కుట్లు వేశారు. గతంలో కూడా ఆకాశ్ భార్యపై దాడి చేశాడు. ఆ సమయంలో ఆమెకు వైద్యులు ఆరు కుట్లు  వేశారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆకాశ్ పోలీసు హెడ్ కానిస్టేబుల్ కావడంతో పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని బాధితురాలు ఆరోపించింది. దీంతో నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని ఉన్నాతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.