ఎయిడ్స్ ఉన్న మహిళ చనిపోయిందని చెరువు ఖాళీ - MicTv.in - Telugu News
mictv telugu

ఎయిడ్స్ ఉన్న మహిళ చనిపోయిందని చెరువు ఖాళీ

December 6, 2018

హెచ్‌ఐవి/ఎయిడ్స్ వ్యాధి గురించి ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పించినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఇంకా అనేక మూఢనమ్మకాలు ఉంటున్నాయి. కర్ణాటకలో ఇటీవల చోటుచేసుకున్న ఒక అమానుష ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడంతో మొత్తం చెరువు నీటినే ఖాళీ చేయిస్తున్నారు గ్రామ ప్రజలు. కారణం ఆమెకు హెచ్‌ఐవీ సోకిందన్న అనుమానం. దీనితో ఆ చెరువు నీళ్లు తాగేందుకు ప్రజలు నిరాకరించారు. చెరువు ఖాళీ చేయిస్తారా? లేదా అంటూ అధికారులను పట్టుబట్టారు. దీంతో అధికారులు కూడా వారి మాటకు తలొగ్గక తప్పలేదు. చేసేదేమీలేక 36 ఎకరాల్లో విస్తరించివున్న చెరువును మోటార్ల సహాయంతో ఖాళీ చేయిస్తున్నారు.ఉత్తర కర్ణాటకలోని నావల్‌గంద్ తాలూకాలో నవంబర్ 29న ఓ మహిళ మోరబ్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు హెచ్‌ఐవీ సోకిందని గ్రామస్తుల అనుమానం. దీంతో ఆ చెరువులో నీరు తాగడానికి నిరాకరించారు. ఎయిడ్స్ నీటి ద్వారా వ్యాపించదని వైద్య అధికారులు చెప్పడానికి ప్రయత్నించినా ఆ గ్రామస్తులు వినలేదు. మొదట ఆ నీళ్లను పరీక్షిస్తామని, అందులో హెచ్‌ఐవీ కారక వైరస్ ఉంటే, అప్పుడు నిర్ణయం తీసుకుందామని తెలిపారు. అయినా కూడా మోరబ్ గ్రామస్తులు వినలేదు. ఆ నీటిని తోడి, మళ్లీ అందులో నీళ్లు నింపాలంటే కనీసం పది రోజులు పడుతుందని చెప్పినా వినలేదు.

చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నింటికీ తాగునీరు అందించేది ఆ చెరువే. ఆ పది రోజుల పాటు ఏం చేస్తారని అధికారులు ప్రశ్నించగా బయట ఎక్కడి నుంచి అయినా నీటిని తెచ్చుకుంటాం కానీ ఆ చెరువులో నీళ్లు తాగమని తెలిపారు. దీంతో అధికారులు చెరువులో నీటిని ఖాళీ చేయిస్తున్నారు. మూడు రోజుల నుంచి మోటార్లు, పైపులు వేసి ఆ చెరువులో నీటిని తోడేస్తున్నారు. ఇప్పటి వరకు చెరువులో 40శాతం నీరు మాత్రమే ఖాళీ అయింది. ఇంకా 60 శాతం మిగిలి ఉంది. ఆ నీటిని ఖాళీ చేసి, మళ్లీ నీరు నింపాలంటే కనీసం వారం రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈనెల 8వ తేదీ తర్వాత మలప్రభ కాలువకు నీటి ప్రవాహాన్ని నిలిపివేయనున్నారు. ఈ చెరువు ఖాళీ అయ్యేదెప్పుడు? ఆ నీటిని మళ్లీ చెరువులో నింపేదెప్పుడు? అని గ్రామస్తుల కంటే అధికారులే ఎక్కువ టెన్షన్ పడుతున్నారు. మరోవైపు చెరువు ఖాళీ చేస్తుండడంతో మోరబ్ గ్రామస్తులు తాగునీటి కోసం మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి మలప్రభ కాలువ నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఎంతదూరమైనా వెళ్లి తెచ్చుకుంటాం, ఎన్ని రోజులైనా తెచ్చుకుంటామంటున్నారే కానీ, చెరువులో కొత్త నీరు నింపే వరకు ఆ నీరు తాగబోమని స్పష్టం చేస్తున్నారు. అది మన గ్రామీణ ప్రాంతాల్లో ఎయిడ్స్ గురించి ఉన్న అవగాహన.