కలర్స్ స్వాతికి కత్తిమహేశ్ లవ్ లెటర్ - MicTv.in - Telugu News
mictv telugu

కలర్స్ స్వాతికి కత్తిమహేశ్ లవ్ లెటర్

November 20, 2017

సినిమాలకు రివ్యూలు రాస్తూ, ఎప్పుడూ ఏదో ఓ వివాదంలో ఉండే కత్తి మహేష్  ప్రేమలో పడ్డాడు. సినిమాలకు రివ్యూలనే కాదు, అమ్మాయిలకు ప్రేమలేఖలు రాయడంలోనూ దిట్టి అని అనిపించుకున్నాడు. తాజాగా హీరోయిన్ కలర్స్ స్వాతికి రెండో ప్రేమలేఖ రాశాడు కత్తి.  చాలారోజుల క్రితం స్వాతికి రాసిన మొదటి ప్రేమలేఖను ఇంకా తన మససులోనే దాచుకున్నాడట. కానీ ఇప్పుడు పేపర్‌పై పెట్టాడు. మరి కత్తి మహేశ్ కలంలోంచి వచ్చిన ఆ ప్రేమలేఖను మీరూ చదవండి.‘డియర్ స్వాతి,

ఆ మధ్యనేను రాసిన ప్రేమ లేఖ ఇంకా పచ్చిగానే నా మనసులో ఉంది. నీ ప్రతిభకు తగని పాత్రలో నువ్వు కనిపించి కష్టపెట్టిన నా మనసు గాయం మొన్నటివరకు తాజాగానే ఉండేది. కానీ…”లండన్ బాబులు” చూసాను. ముద్దుమాటల స్వాతి ఒక మెచ్యూర్ నటిగా ఎదగడం చూసాను. ఒక్క మాట కూడా అవసరం లేకుండా కళ్ళతో, పెదాలతో, నవ్వుతో, కనుబొమ్మల ముడితో, కనురెప్పల వాల్పుతో, విరిసీ విరియని నవ్వుతో, వంకించిన మెడతో, పదానికి పదానికి మధ్య పాజ్‌తో నటించగల ప్రతిభని మళ్ళీ చూసాను. సూర్యకాంతంతో ప్రేమలో పడ్డాను. స్వాతి… నీతో మళ్ళీ ప్రేమలో పడ్డాను.

మొదట జాలిపడి తరువాత అభిమానించి సహాయం చేసిన గాంధీ, మాటలు రావని చెప్పి మోసం చేశాడని తెలిసిన క్షణంలో… మోసపోయాననే కోపం, అతని నిస్సహాయత మీద జాలి, మూగవాడు కాదనే ఆనందం ఇన్ని భావాల్ని ఒక్క క్షణంలో పలికించగల నటుల్ని వెళ్ల మీద లెక్క పెట్టగలం. ఆ వేళ్లలో మొదట పలికే పేరు ఇప్పుడు నీది.  క్లైమాక్స్ లో గాంధీ పెళ్లి చేసుకుందామా అన్నప్పుడు… ప్రేమో కాదో తెలియని సందిగ్దత, అవధులు లేని అభిమానపు వెల్లువ, ఎక్కడో కాదనాలనే ఆత్మాభిమానం, ఎందుకు వద్దనాలి అనే తీవ్రమైన ప్రేమ,అనుమానం,ఆనందం, సహజమైన సిగ్గు బిడియాన్ని పక్కకు నెట్టే ఆలోచన, నాకు కావలసింది నాకు తెలుసు అనే ధీమా. నిన్ను నేను నమ్ముతాను అనే భరోసా. ఇన్ని భావాల్ని ఒక్క విరిసీ విరియని నవ్వులో చెప్పావు చూడు.. హ్యాట్సాఫ్!

అందుకే ఆగలేక, మనసు ఆపుకోలేక.. రాశాను ఈ లేఖ. అందుకో ఈ ప్రేమ లేఖ’ అంటూ  కత్తి మహేశ్ తన ప్రేమలేఖను  ముగించాడు.