కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్….ఓ అడుగు ముందుకు

తెలంగాణ ముఖ్యమంత్రి చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్‌కు మార్గం సుగమం అవుతున్నట్లుంది. ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో జరిగిన  రాజకీయ పరిణమాలు దీన్ని రుజువు చేస్తున్నాయి. కొద్ది నెలల నుండి జాతీయ రాజకీయాల్లో మార్పు అనివార్యమని, అది ఫెడరల్ ఫ్రంట్ రూపంలో వస్తుందనే  చర్చ జరుగుతోంది. దీనిపైనే వివిధ రకాల ఏజెన్సీలు సర్వేలు కూడా చేస్తున్నాయి. తాజాగా వీడీపి సర్వే పార్టీలు, ఓట్లు, సీట్లు వంటి అంశాలపై స్పష్టతనిచ్చింది. బీజేపీ, కాంగ్రెస్ కాకుండా మూడో ఫ్రంట్‌కే  అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆ సర్వే స్పష్టం చేసింది

Telugu news KCR Federal Front .... A step forward

యూపీలో బహుజన్ సమాజ్ పార్టీ,  సమాజ్‌వాది పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని చెప్పాయి. మాయావతి, అఖిలేష్ ఇద్దరూ  కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధాని అభ్యర్థి ఫలానా అని నిర్ధిష్టంగా చెప్పకున్నా మాయావతికే తమ మద్దతని అఖిలేష్ చెప్పారు.   రాహుల్ గాంధీకి, మోదీకి తాము మద్దతునివ్వడం లేదనే విషయం కూడా అఖిలేష్ మాటలతో స్పష్టం అయింది.

ఇక బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా  బీజేపీ, కాంగ్రెస్‌లకు మద్దతునిచ్చే విషయంపై ఇప్పటి వరకు స్పష్టంగా చెప్పలేదు. మొన్నీమధ్యనే ఆమె మేనల్లుడు భారత ప్రధానమంత్రి  అభ్యర్థిగా మమతా ఉంటారని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. బెంగాల్ రాజకీయాలు కూడా ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నాయనే విషయం అర్థం అవుతోంది.

మొన్నటి ఐదు రాష్ట్రాల  ఎన్నికల్లో బలమైన పార్టీలుగా బీజేపీ, కాంగ్రెస్ రెండూ  కన్పించలేదు. ఓట్లు, సీట్లు కూడా బొటాబొటిగా వచ్చాయి. దానికి తోడు బెంగాల్, తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్నాటకల్లో రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీలు బలంగా లేవు. లోక్‌సభ స్థానాలు ఆయా రాష్ట్రాలకు చెందిన పార్టీలకే ఎక్కువగా  వచ్చే అవకాశం ఉంది. ఒడిస్సాలోనూ నవీన్ లేకుండా బీజేపీకి సీట్లు సాధించుకునే శక్తి లేదు. నవీన్ పట్నాయక్ కూడా తాము బీజేపీ, కాంగ్రెస్‌లతో కలిసి పని చేస్తామని తానే స్వయంగా ఎక్కడా చెప్పలేదు.

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు   ఫెడరల్ ఫ్రంట్ గురించి చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు దేశ వ్యాప్తంగా పర్యటించారు. తమిళనాడు, బెంగాల్, ఒడిస్సా, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలకు చెందిన ముఖ్య నాయకులతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్  అవసరాన్ని గురించి చెప్పారు. ఆ తర్వాత తాము ఫెడరల్ ప్రంట్‌లో ఉండటం లేదని ఆయా రాష్ట్రాలకు చెందిన నాయకులూ చెప్పలేదు.

అంతిమంగా అర్థం అవుతున్న విషయం ఏంటంటే… వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మూడో కూటమి లేదా ఫెడరల్ ఫ్రంట్‌కే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని. ఉత్తరప్రదేశ్‌లో  జరిగిన రాజకీయ పరిణామం కూడా దీనికి తోడైంది. ఇక యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల నుండి ఏ పార్టీ ఎక్కువ లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటే వారిదే ప్రధాని పీఠం.

దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాల్లో ఈ రెండు జాతీయ పార్టీల ప్రభావం అంతగా లేదు. కాబట్టి ఉత్తర, మధ్యభారత, దక్షిణ భారత రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు ఖచ్చితంగా అనుకుంటే కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటు ఎంత దూరం లేదని అన్పిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్  ఏర్పాటుకూ ఎంత సమయం పట్టేలా లేదని కూడా జరుగుతున్న పరిణమాలు సంకేతాలిస్తున్నాయి.Telugu news KCR Federal Front …. A step forward