సిద్దిపేట జిల్లాలో బుధవారం పలు శంకుస్థాపనులు చేసిన కేసీఆర్, అనంతరం సిద్దిపేట బహిరంగసభలో మాట్లాడారు. ‘నాకు జన్మనిచ్చింది సిద్దిపేటనే, రాజకీయ జన్మనిచ్చింది సిద్దిపేటనే. అనర్గళ గళమిచ్చింది.. పోరాట బలమిచ్చింది, పదవులు ఇచ్చింది సిద్దిపేట. నా గురువుల దయతో ఈ మట్టిలో మొలిచిన మొక్కను నేను, నా జన్మభూమికి శిరస్సు వంచి నమస్కారం’ అంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టాడు కేసీఆర్. ‘చాలా సంవత్సరాల క్రితం సిద్దిపేటను జిల్లా చెయ్యమని, దానికి సంబంధించిన మ్యాప్ గీయించి అంబేడ్కర్ విగ్రహం వద్ద అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు దరఖాస్తు ఇచ్చాము, ఇలా చాలాసార్లు, చాలా దరఖాస్తులు ఇచ్చాం, అయినా సిద్దిపేట జిల్లా కాలేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అది సాధ్యమైంది. సిద్దిపేట జిల్లా తెలంగాణకే గుండె కాయలాంటిది, సిద్దిపేట జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుతాయి. సిద్దిపేటలోనే నేను డిగ్రీ చేశా…మీ దీవెనెలతో ఇక్కడినుంచే శాసనసభకు వెళ్లాను. రంగనాయకి చెరువు తొందరలో గోదావరి నీళ్లతో నిండుతది. 25 కోట్ల నిధులను కోమిటి చెరువుకు విడుదల చేస్తాం. దుబ్బాక, చేర్యాల, హుస్తానబాద్లో అన్ని అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తాం. సిద్దిపేట కోసం పోలీస్ బెటాలియన్, జిల్లా జైల్ కూడా ఏర్పాటు చేస్తాం. రాష్టంలో నం 1 జిల్లా సిద్దిపేట కావాలి.. ఈ జన్మభూమి బిడ్డగా మీరు ఏది అడిగిన కాదనను. సిద్దిపేట కోసం నాచర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కోనే’ అని కేసీఆర్ భావోద్వేగంతో అన్నారు.