నువ్వు కొట్టినట్టు చెయ్  నేను ఏడ్చినట్లు చేస్తా : కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

నువ్వు కొట్టినట్టు చెయ్  నేను ఏడ్చినట్లు చేస్తా : కేసీఆర్

March 3, 2018

ఈ సామెతను మీరు గతంలో వినుంటారు. కానీ శనివారం ప్రగతి భవన్‌లో మీడియాతో జరిగిన సమావేశంలో సియం కేసీఆర్ ప్రత్యేక హోదా విషయంలో ఈ సామెతను వాడారు. ప్రత్యేకహోదా విషయంలో ముసుగులు గుద్దులాటలు వద్దని, ఏదైనా ఉంటే ప్రజలకు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాలని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో  కేంద్రప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని కేసీఆర్ అన్నారు.

ప్రత్యేక హోదా ఇస్తానని మోడీ అన్నారా? లేదా అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని తెలిపారు. ఇస్తామని చెబితే ఖచ్చితంగా ఇవ్వాలి. అలా చెప్పలేదంటే మేం ఇవ్వలేం అని క్లారిటీగా చెప్పాలి అంతేగానీ నువ్వు కొట్టినట్టు చెయ్ నేను ఏడ్చినట్లు చేస్తా అనేది పద్దతి కాదు. చంద్రబాబు కూడా స్పష్టత వ్యవహరిస్తే బాగుంటుందని, అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మంచిదని ఆయన అన్నారు.

కేంద్రం చాలా విషయాల్లో అస్పష్టతతో ముందుకు పోతోందని ఈ విధానం దేశ భవిష్యత్తుకు మంచిది కాదని, ఆంధ్రప్రదేశ్‌ను ఏడిపిస్తే అది ఎవరికీ మంచిది కాదనే విషయాన్ని కేసీఆర్ వివరించారు. అయితే ప్రత్యేక హోదా కోసం అవిశ్వాసం అనే అంశాన్ని కేసీఆర్ కొట్టి పడేశారు. అదో పొలిటికల్ డ్రామా అని ఆయన తేల్చారు.