థర్డ్‌ఫ్రంట్ కోసం కేసీఆర్ వ్యూహరచన - MicTv.in - Telugu News
mictv telugu

థర్డ్‌ఫ్రంట్ కోసం కేసీఆర్ వ్యూహరచన

March 6, 2018

దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావటానికి జాతీయస్థాయిలో థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటు చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా పావులు కదుపుతున్నారు. జాతీయ స్థాయిలో కాలుదువ్వటానికి పథక రచన చేస్తున్నారని తెలుస్తోంది. భవిష్యత్ ప్రణాళికలు ఎలా వుండాలన్న దానిమీద వ్యూహరచనలు మొదలుపెట్టారు. దేశవ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన సంఘాలు, సంస్థలు, ప్రముఖులతో వరుస సదస్సులు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ సదస్సులను హైదరాబాద్, ఢిల్లీతోపాటు ముంబై,  బెంగళూరు, కోల్‌కతా, చెన్నై తదితర నగరాల్లో కూడా నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. వివిధ వర్గాల ప్రతినిధులతో వరుస సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం కొందరు సమన్వయకర్తలను నియమించారు. తలపండిన వారితో చర్చలు జరపాలని నిర్ణయించారు. జాతీయ స్థాయిలోనూ, వివిధ రాష్ట్రాల్లోనూ ఏండ్ల తరబడి ప్రభుత్వంలో పనిచేసిన, అనేక రాజకీయ పరిణామాలను చూసిన అనుభవం వారికి ఉన్నందున దేశానికి కావాల్సిన ఎజెండాను రూపొందించడానికి అటువంటివారితో చర్చించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.మొదటగా కేంద్ర ప్రభుత్వంలోనూ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలలోనూ పనిచేసి రిటైర్ అయిన ఆర్థికశాఖ కార్యదర్శులు, అధికారులతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్,  ఐపీఎస్, ఐఆర్‌ఎస్ లాంటి ఆలిండియా సర్వీసులలో పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులతోనూ సమావేశం కానున్నారు. నావికాదళ, సైనిక, వైమానిక దళాల్లో పనిచేసి రిటైరైన ఉద్యోగులతోనూ సంప్రదింపులు జరపనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న న్యాయనిపుణులు, ప్రముఖ న్యాయవాదులు, అఖిలభారత రైతు సంఘాలు, వివిధ రాష్ట్రాలలో పనిచేస్తున్న రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమై, వారి అభిప్రాయాలు తీసుకుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగ సంఘాలతో, జర్నలిస్టులు,  మీడియా సంస్థలు, పారిశ్రామికవేత్తలు, కార్మిక సంఘాల ప్రతినిధులతో కూడా సమావేశాలు నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు.