కేంద్రంపై కాలు దువ్విన కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్రంపై కాలు దువ్విన కేసీఆర్

February 26, 2018

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ నుంచి రైతాంగపోరు మొదలవుతుందని, ఇందులో అన్ని రాష్ట్రాలూ కలిసి రావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కరీంనగర్‌లో సోమవారం  నిర్వహించిన రైతుల సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సులో ప్రసంగించారు.  పంటలకు మద్దతు ధర పెంచే ధైర్యం ప్రధాని నరేంద్ర మోదీకి లేదని, మార్చి 5 నుంచి జరగనున్న కేంద్ర బడ్జెట్‌ సమావేశాల్లో పార్లమెంట్‌లో తమ పార్టీ ఎంపీలు ఆందోళన చేస్తారని, రైతు సమస్యలపై టీఆర్ఎస్ ఎంపీలు గట్టిగా పోరాడాలని కేసీఆర్ అన్నారు.

దేశంలో రైతుల దుస్థితికి కారణం గత ప్రభుత్వాలు అవలంభించిన విదానాలేనని, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని రెండు పార్టీలే పాలించాయని, తెలివితక్కువ కాంగ్రెస్‌, భాజపా వల్లే రైతుల పరిస్థితి ఇప్పటికీ మెరుగుపడలేదని అన్నారు.  రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించిన పార్టీలు ఇప్పుడు రోడ్డునపడి ధర్నాలు చేయటం ఆశ్యర్యంగా వుందని విమర్శించారు.

కేంద్ర బడ్జెట్‌లో రైతులకు మొండి చెయ్యి చూపించారు. రైతులు సహనం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జాతీయ ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రావాలని సూచించారు. అవసరమైతే దేశవ్యాప్త రైతాంగ ఉద్యమానికి నేనే నాయకత్వం వహిస్తానన్నారు.

‘ పంటకు కనీస మద్దతు ధర రాబట్టే ప్రక్రియ ఈ యాసంగి నుంచే మొదలు కావాలి. అవసరమైతే రాష్ట్ర రైతు సమన్వయ సమితికి రూ.10వేల కోట్లు కేటాయిస్తాం. మద్దతు ధరను రైతు పండించే ప్రతి గింజకూ రాబట్టాలి. రెండో యాసంగి పంటలో 19లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. 4లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములను 23లక్షల మెట్రిక్‌ టన్నులకు పెంచాం. ఆహారశుద్ధి పరిశ్రమలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వల్లనే ఇదంతా సాధ్యమవుతోంది. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం చేయని పని మా ప్రభుత్వం చేస్తోంది ’ అని కేసీఆర్‌ అన్నారు.