కేసీఆర్ కొత్త ప్లాన్‌ను రెడీ చేస్తుండా? - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ కొత్త ప్లాన్‌ను రెడీ చేస్తుండా?

March 3, 2018

కేసీఆర్ ఏకంగా ఢిల్లీ గద్దనే దడ దడలాడించాలనుకుంటున్నాడా?  కాంగ్రెస్ ,బీజేపీలను లక్ష్యంగా ప్రకటించిన కేసీఆర్ ఎవరితో దోస్తీ చేయబోతున్నాడు? దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గరున్న వ్యూహమేంటి? ప్రగతి భవన్‌లో  కేసీఆర్ ప్రెస్‌మీట్ తర్వాత ఉత్పన్నమవుతోన్న ప్రశ్నలివి. దాదాపు గంటన్నర పాటు సాగిన కేసీఆర్ ప్రెస్‌మీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటు తెలుగు రాష్ట్రాలకు అటు జాతీయ మీడియాకు చాలా రోజులకు సరిపడా వార్తలను సియం కేసీఆర్ అందించినట్టే.

తొలి అడుగు నేనే అవుతా..

‘దేశంలో ఎక్కడికైనా గంటన్నరలో వెళ్లగల  సౌకర్యాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉండి కూడా దేశ రాజకీయాల్లో మార్పు తీసుకువచ్చే వ్యూహ రచనలు చేయవచ్చు’ అని కేసీఆర్ కుండ బద్దలు కొట్టాడు. ‘కాంగ్రెస్, బీజేపీలు దేశంలో గుణాత్మకమైన మార్పులు తేవడంలో విఫలమయ్యాయి  అందుకోసం పక్కాగా ప్రత్యామ్నాయం అవసరం. దీనికోసం నేనే తొలి అడుగును అవుతాను’ అని కేసీఆర్ తెలిపారు. ఎక్కడినుంచి మొదలు పెట్టాలి? ఎలా మొదలు పెట్టాలి? అనే విషయాల్లో స్పష్టత లేదు అని ఆయన అన్నారు.

మైనస బీజేపీ, మైనస్ కాంగ్రెస్

మైనస్ బీజేపీ, మైనస్ కాంగ్రెస్ రాజకీయాలే దేశానికి  మేలు చేస్తాయని కేసీఆర్ తెలిపారు. దీన్నిబట్టి కేసీఆర్ తన కార్యాచరణను  సిద్ధం చేయబోతున్నట్లు మనకు అర్ధం అవుతోంది. అయితే దేశం మేలుకోసం కేసీఆర్ మమతా బెనర్జీని కలుపుకుంటారా? లాలూతో దోస్తీ చేస్తారా? లెఫ్ట్ పార్టీలతో రైట్ రైట్ అంటారా? కేజ్రీవాల్‌ని కౌగిలించుకుంటారా? తమిళనాడులో పుట్టుకొస్తున్న కొత్త రాజకీయ శక్తులకు తానే డైరెక్టర్‌గా మారబోతున్నాడా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ , పవన్‌లతో ఉంటారా? లేకపోతే చంద్రబాబుతో చెట్టాపట్టాలేసుకుంటాడా?  అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉన్నది.

కేసీఆర్‌కు ప్రధాని కావాలనే  ఆలోచన ఏమైనా వచ్చిందా?

ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ ఇక కేసీఆర్ ప్రధాని అని  ఓ రిపోర్టర్ లేవనెత్తిన ప్రశ్నకు కేసీఆర్ తనదైన శైలిలో జవాబు చెప్పాడు. ‘ నాకు ఇప్పడు 64 ఏండ్లు. 48 ఏండ్ల వయసులో తెలంగాణ ఉద్యమాన్ని తెరమీదకు తెచ్చి విజేతగా నిలబడ్డా. ఇప్పుడు కూడా నాఆరోగ్యం, దేవుడు సహకరిస్తే  ఖచ్చితంగా  దేశ రాజకీయాల్లో  చక్రం తిప్పుతా’ అని కేసీఆర్ అన్నారు. దీన్ని బట్టి  కేసీఆర్ కు ప్రధాని కావాలనే ఆలోచన వచ్చిందా అనే అనుమానం మనకు కలుగక మానదు.