అఖిల్ సినిమాకు ఆటంకం

అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా సినిమా ‘ హలో’ కి డిస్ట్రిబ్యూటర్ల నుండి పెద్ద సమస్య వచ్చి పడింది. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌లో స్వ‌యంగా తండ్రి నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించాడు. చిత్రం పంపిణీ కోసం నిర్మాత‌లు భారీగా కోట్ చేసిన‌ట్లు స‌మాచారం. నైజాం ప్రాంతానికి రూ. 15 కోట్లు, ఆంధ్రా ప్రాంతానికి రూ. 15 కోట్లు, సీడెడ్ ప్రాంతానికి రూ. 5 కోట్లు, ఓవ‌ర్సీస్ మార్కెట్‌కి రూ. 5 కోట్లు కోట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఇంత మొత్తం చెల్లించ‌డానికి పంపిణీదార్లు ముందుకు రావ‌డం లేద‌ట‌. డిసెంబ‌ర్ 22న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ ఈ సినిమాకు డిస్ట్రిబ్యూట‌ర్ల స‌మ‌స్య వ‌చ్చిందని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. అఖిల్ తొలి మూవీ ‘అఖిల్’  అతనికి అంతగా కలిసిరాక అది ఫ్లాప్ అయింది. తాజాగా హలో సినిమా చేస్తున్నాడు.

మహేష్ నటించిన ‘స్పైడర్’ తమకు తీవ్ర నష్టాలను మిగిల్చిందంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఇంకా ఆ నష్టాన్ని పూడ్చలేకపోతున్నామని,. ఇప్పుడీ అఖిల్ సినిమా కోసం అంత ఇచ్చుకోలేమ‌ని వారు అంటున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఓవ‌ర్సీస్ డిస్ట్రిబ్యూట‌ర్లు వెన‌కాడుతున్నార‌ట‌. సినిమా విడుద‌ల‌కు ఇంకా రెండు నెల‌ల స‌మ‌యమే ఉండటంతో ఈ విష‌యానికి సంబంధించి చిత్ర నిర్మాత‌లు చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. విక్ర‌మ్ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా మీద నాగార్జున చాలా హోప్స్ పెట్టుకున్నాడట. చిన్నకొడుకు అఖిల్‌కు ఎలాగైనా హిట్టివ్వాలనుకుంటున్నాడు.

SHARE