హాస్య నటుడిపై పోలీస్ కేసు..! 

ప్రముఖ తమిళ హాస్యనటుడు సంతానంపై హత్యా బెదిరింపు కేసు నమోదైంది. దీంతో సంతానం పరారీలో ఉన్నట్టు సమాచారం.  తమిళ సినీ పరిశ్రమలో సంతానం హాస్య నటుడిగా ఎదిగి  తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.  చెన్నై చౌదరి నగరానికి చెందిన కాంట్రాక్టర్ షణ్ముగ సుందరంతో కలసి సంతానం కుండ్రత్తూర్ సమీపంలోని కొవూర్ ప్రాంతంలో  ఓ కళ్యాణ మండపాన్ని నిర్మించడానికి ఏర్పాట్లు చేశాడు. తన వాటాగా భారీ మెుత్తాన్ని షణ్ముగసుందరానికి చెల్లించాడు.  తరువాత కళ్యాణ మండపం నిర్మాణాన్ని విరమించుకున్నారు. దీంతో సంతానం షణ్ముగసుందరంను డబ్బు తిరిగి అడగ్గా, కొంత డబ్బు మాత్రమే ఇచ్చాడు. మిగతా డబ్బును ఇవ్వకుడా ఉండడంతో, సోమవారం సంతానం తన మేనేజర్ రమేష్‌తో కలసి షణ్ముగసుందరం ఆఫీసుకు వెళ్లి తన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి  కొట్టుకునే స్థాయికి వెళ్లింది. ఆ సమయంలో షణ్ముగ సుందరంతోపాటు ఆయన మిత్రుడు బీజేపీ నాయకుడు ప్రేమానంద్ ఉన్నాడు.  కొట్లాటలో ముగ్గురికి దెబ్బలు తగిలి స్థానిక పడవళలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు.  

సంతానంపై వలసరవాక్కం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. విచారణకు వెళ్లిన పోలీసులకు  సంతానం పరారీలో ఉన్నాడని  తెలిసింది. ఈ సంఘటన కోలీవుడ్‌లో కలకలానికి దారితీసింది.

SHARE