ఎర్రబెల్లీ.. మీవి పగటి కలలు - MicTv.in - Telugu News
mictv telugu

ఎర్రబెల్లీ.. మీవి పగటి కలలు

October 25, 2017

వరంగల్‌లో గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరాయి. ఒకే పార్టీకి చెందిన రెండు కుటుంబాల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎర్రబెల్లి, కొండా కుటుంబాలు బహిరంగ వేదికల్లోనే తిట్టుకుంటున్నాయి. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ.. ఎర్రబెల్లి సోదరుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.

సురేఖ మాట్లాడుతూ.. ‘ఈ మధ్యకాలంలో పుట్టగొడుగుల్లా కొందరు పుట్టుకొస్తున్నారు. ఆ కుటుంబంలో ఉన్నవాళ్లు బాగుచేయడానికి పనికిరారు కానీ చెడగొట్టుమంటే మరుక్షణంలో ముందుంటారు. విషపు చుక్కలాగ పనిచేసే కుటుంబం ఏదైనా ఉన్నదంటే అది కేవలం ఎర్రబెల్లి కుటుంబమే’ అని మండిపడ్డారు. ‘రాజకీయంగా  మమ్మల్ని ఎంత అణగదొక్కాలని చూసినా, ఇంకా పైకి ఎదిగి వాళ్ల కుటుంబం కంటే ముందే మంత్రి పదవిని అనుభవించిన వాళ్లం మేము. మెడకు జెండా కట్టుకుని యవతకు బీరు, బిర్యానిలిచ్చి లేనిపోని ఆశలు చూపుతున్నారు.

యువత వాటికి లొంగి, బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దు‘ అని ఆమె సూచించారు.  ఎర్రబెల్లి అన్నదమ్ముల మధ్యే సఖ్యత లేదని అన్నారు.  ‘9 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, అప్పుడు అధికారంలో ఉన్న మీ అన్న మమ్మల్నీ ఏమీ చేయలేకపోయాడు. మరి ఇప్పుడు ప్రజాదారణలో ఉన్న మమ్మల్ని ఏదో చెయ్యాలని పగటికలలు కని మీ సమయాన్ని వృథా చేసుకోవద్దు’ అని ఎర్రబెల్లి సోదరులను ఆమె ఎద్దేవా చేశారు