‘కొత్తపల్లి జయశంకర్’సీడీ రిలీజ్ - MicTv.in - Telugu News
mictv telugu

‘కొత్తపల్లి జయశంకర్’సీడీ రిలీజ్

September 10, 2017

డెక్కన్ టాకీస్ సమర్పణలో తెలంగాణ కాలజ్ఞాని ప్రొఫెసర్ ‘కొత్తపల్లి జయశంకర్’పేరుతో చేరణ్ ఓ డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి సంబంధించిన బిగ్ సీడీని హైదరాబాద్‌లో బీసీ కమీషన్ సభ్యులు జూలూరి గౌరీశంకర్ విడుదల చేయగా,సీడీని టీఎఫ్‌డీసీ ఛైర్మన్ పుస్కూర్ రామ్మోహన్‌రావు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్ని వలసవాదులు కించపరుస్తున్నారని అలాంటి వారిని ఉపేక్షించకూడదని ఆ రోజుల్లోనే జయశంకర్‌గారు తీవ్రంగా స్పందించారు. తెలంగాణను ఇక్కడి వారే పరిపాలించాలని గట్టిగా వాదించారు. బెనారస్‌లో ఉన్నత చదువు చదివి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీని పూర్తి చేశారు. ఏ చిన్న సమస్య మొదలైనా దానిపై పోరాటం చేశారు. మన స్వయం పాలన ఎప్పుడు ఎలా వస్తుందా? అని అహర్నిశలు తపించారాయన. ఇవన్నీ డాక్యుమెంటరీలో దర్శకుడు చేరణ్ పొందుపరిచారు. జయశంకర్‌ గారిని ప్రతీ విద్యార్థినీ విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.

జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ తెలంగాణ తొలి ఎఫ్‌డీసీ ఛైర్మన్ జయశంకర్‌సార్‌పై రూపొందిన సీడీని విడుదల చేయడం సంతోషంగా వుంది. జయశంకర్ యావత్ తెలంగాణకు ఒక భావాజాలాన్ని అందించారు. ఆ భావజాల ఆయుధంతో ఉద్యమానికి, కేసీఆర్‌కు, ప్రజా సంఘాలకు ఒక తాత్విక భూమికను అందించిన వ్యక్తి జయశంకర్. ఆయనను స్మరించుకోవడం, ఆయన చరిత్రను తెలుసుకోవడం మన అందరికి ఎంతో అవసరం. ఆ అవసరాన్ని గుర్తించి జయశంకర్ డాక్యుమెంటరీని రూపొందించిన దర్శకుడు చేరణ్ అభినందనీయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు చేరణ్, రచయిత అభి ఉప్పుల, సామాజిక ఉద్యమకారుడు బాధమోని వెంకటస్వామి, ప్రముఖ నటుడు రవి వెగ్గలం, మర్రి శ్రీనివాస్, శివసాగర్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ కోసం ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎంత తపన పడ్డారో అందరికి తెలిసిందే. 1969లో జరిగిన ఉద్యమంలోనూ క్రియాశీలకంగా పాల్గొనడమే కాకుండా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. కేసీఆర్‌ కూడా ఆయన నుంచి స్ఫూర్తి పొంది అత్యంత సన్నిహితులయ్యారు. జయశంకర్‌సార్ చిన్న తనంలో జరిగిన విషయాలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ రోజుల్లోనే నిజాంకు సంబంధించిన గీతాన్ని పాడమని వేధిస్తే వందేమాతర గీతాన్ని మాత్రమే ఆలపిస్తానని నిక్కచ్చిగా చెప్పిన వ్యక్తి జయశంకర్‌గారు. అలాంటి వ్యక్తిపై డాక్యుమెంటరీని రూపొందించడం ఆనందంగా వుంది. ఆయన జీవిత చరిత్రపై తెలంగాణ కాలజ్ఞాని ప్రొ.కొత్తపల్లి జయశంకర్ పేరుతో రూపొందించిన ఈ డాక్యుమెంటరీ సీడీని, టీఎఫ్‌డీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నా చేతుల మీదుగా విడుదలవుతున్న తొలిసీడీ కావడం నాకెంతో ఆనందంగా వుంది అన్నారు టీఎఫ్‌డీసీ ఛైర్మన్ పూస్కూర్ రామ్మోహన్‌రావు.

చివరిగా దర్శకుడు చేరణ్ మాట్లాడుతూ.. 2011 నుండి తెలంగాణ వుద్యమంపై సినిమాలు చేస్తున్నాను. నాకు సినీ రంగంలో బి. నర్సింగ్ రావు సారే. ఆయనలా మనుషులు జీవితాలకు దగ్గరగా వుండే సినిమాలు తియ్యడమే ఇష్టమంటున్నాడు. వక్రీకరణ లేని తెలంగాణ చరిత్రను తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ 56 నిమిషాల నిడివి గల డాక్యుమెంటరీని రూపొందించినట్టు తెలిపాడు.