కేటీఆర్‌.. ఈ వెబ్‌సైట్‌పై చర్యలు తీసుకోండి - MicTv.in - Telugu News
mictv telugu

కేటీఆర్‌.. ఈ వెబ్‌సైట్‌పై చర్యలు తీసుకోండి

February 12, 2018

సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న భూతం పైరసీ.. ఇప్పుడా భూతం ఇంటర్నెట్ రూపాన్ని ధరించింది. దీనిపై ఓ వెబ్‌సైట్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని సినీ రచయిత కోన వెంకట్ మంత్రి కేటీఆర్‌కు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కొత్త సినిమాలు థియేటర్లలో పడిన వెంటనే… దానికి సంబంధించిన పైరసీలు వెబ్ సైట్లలో ప్రత్యక్షం అవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని సినిమాలైతే, విడుదలకు ముందే కొన్ని వెబ్‌సైట్లలో ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో, కోట్లాది రూపాయల పెట్టుబడితో సినిమాను నిర్మిస్తున్న నిర్మాతలు భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌కు సినీ రచయిత కోన వెంకట్ ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.‘కేటీఆర్ గారూ, మూవీరూల్జ్ ( movierulz ) అనే వెబ్‌సైట్‌పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. నిన్న మొన్న విడుదలైన సినిమాలు ఈ వెబ్‌సైట్‌లో పెడుతున్నారు. దీని ద్వారా తెలుగు సినీ నిర్మాతలకు తీరని నష్టం వాటిల్లుతోంది. తెలుగు సినీ పరిశ్రమకు ఈ వెబ్‌సైట్ ప్రతిబంధకంగా మారింది. ఈ వెబ్‌సైట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించండి. సినీ పరిశ్రమకు మంచి చేయండి ‘ అని పేర్కొన్నారు.

దీనికి సంబంధించిన ఆధారాలను కూడా ఆయన పోస్ట్ చేశారు. వెబ్‌సైట్లో ఉంచిన కొత్తగా రిలీజైన తెలుగు సినిమాల వివరాలను కేటీఆర్‌కు తెలియజేశారు. గాయత్రి, ఇంటెలిజెన్స్, తొలిప్రేమ, బ్రీత్ ( హిందీ ) వంటి సినిమాలు ఈ సైట్‌లో వున్నట్టు పేర్కొన్నారు.