పాప ప్రాణాలు కాపాడిన మంత్రి కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

పాప ప్రాణాలు కాపాడిన మంత్రి కేటీఆర్

April 24, 2018

ట్విటర్‌లో ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా వుండే మంత్రి కేటీఆర్ నిత్యం ప్రజా సమస్యల మీద వెంటనే స్పందిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన చిన్నారి కష్టాన్ని ట్విటర్ ద్వారా తెలుసుకుని బాసటగా నిలిచారు మంత్రి. బాలిక వైద్య ఖర్చులు తనే భరించారు. పేదవారి పట్ల తాను నిలబడతానని నిరూపించారు. తన దృష్టికి వచ్చే సమస్యలను తప్పకుండా సాల్వ్ చేస్తానని మరోమారు భరోసా ఇచ్చారు కేటీఆర్.కూకట్‌పల్లి నియోజకవర్గం అల్లాపూర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ సురేష్‌ కుమార్తె ఎస్‌.దివ్య నాలుగో తరగతి చదువుతోంది. తిరుమలగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దివ్య ఎడమ కాలిపై నుంచి డీసీఎం వెళ్ళింది. దీంతో కాలు నుజ్జునుజ్జు అయింది.  కాలు తొలగించకపోతే దివ్య ప్రాణాలకే ప్రమాదం అని వైద్యులు తెలిపారు. చిన్నారి వైద్యం కోసం రూ.2 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. రెండు లక్షలు పెట్టి కూతురికి వైద్యం చేయించలేని పరిస్థితిలో తల్లిదండ్రులు వున్నారు.

ఈ విషయం తెలుసుకొన్న కూకట్‌పల్లికి చెందిన టీఆర్‌ఎస్‌ యువజన నాయకులు జగన్మోహన్‌రావు కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్ళారు. పరిస్థితిని వివరిస్తూ కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. వెంటనే స్పందించిన కేటీఆర్ నిమ్స్ డైరెక్టర్‌తో మాట్లాడి బాలికకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. వైద్యానికి అయ్యే ఖర్చును సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా విడుదల చేస్తామని తెలిపారు. చికిత్స ప్రారంభించిన వైద్యులు దివ్య కాలిని తొలగించి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం దివ్య కోలుకుంటోందని జగన్మోహన్‌రావు తెలిపారు. కాగా పాప విషయంలో కేటీఆర్ స్పందించిన తీరుకు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు.