కర్నూలు ఎయిర్‌పోర్టు ప్రారంభం.. ఇవీ విశేషాలు.. - MicTv.in - Telugu News
mictv telugu

కర్నూలు ఎయిర్‌పోర్టు ప్రారంభం.. ఇవీ విశేషాలు..

January 8, 2019

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 2017 జూన్‌లో శంకుస్థాపన అయిన ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. రాయలసీమ అభివృద్ధికి ఈ ఎయిర్‌పోర్ట్ కొంతవరకూ ఉపయోగపడుతుందని భావిస్తోంది ప్రభుత్వం. ఈ ఎయిర్‌పోర్ట్ ఏప్రిల్ నుంచీ ప్రయాణికులకు సేవలు అందించనుంది.  2022 నాటికి విమానయాన రంగంలో భారీగా పెట్టుబడులు తేవాలనే లక్ష్యంతో సీఎం ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రూ.110 కోట్లతో 1,010 ఎకరాల్లో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు.Telugu news Kurnool Airport, which started over CM Chandrababu’s handsఓర్వకల్లు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుతోపాటు రూ.6 వేల కోట్ల పెట్టుబడితో 5,88 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన సోలార్‌ పార్క్‌ను సైతం సీఎం ప్రారంభించి, వాటిని జాతికి అంకింతం చేశారు. అనంతరం కర్నూలు ఆస్పత్రిలో రూ.120 కోట్ల వ్యయంతో నిర్మించే స్టేట్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌, ఫార్మా క్లస్టర్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఆపై పాణ్యం మండలం బ్రాహ్మణపల్లి, జూపాడుబంగ్లా మండలం తంగడంచె, బనగానపల్లె పరిధిలో మూడు ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు.

అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ..‘వనరులు సమృద్ధిగా వున్న ప్రాంతం రాయలసీమ. విమానాశ్రయాలను అభివృద్ధి చేయడం ద్వారా పరిశ్రమలు, ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. విమానయాన రంగంలో పెట్టుబడులకు 2022 నాటికల్లా ఆంధ్రప్రదేశ్ తొలి గమ్యస్థానంగా మారనుంది. ఇందుకోసం పెద్దఎత్తున ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. తద్వారా రాష్ట్రంలో గణనీయమైన ఆర్థికాభివృద్ధితో పాటు ఉద్యోగాల కల్పన, ప్రజలకు ఆదాయం సమకూరనుంది’ అని అన్నారు.

విమానాశ్రయం ప్రత్యేకతలు..

ఈ విమానాశ్రయానికి భారీ కార్గో విమానాల్ని నిర్వహించే సామర్థ్యం కూడా ఉంది. 2 కిలోమీటర్ల రన్‌వేతో పాటు, విమానాల పార్కింగ్‌కు 4 యాఫ్రాన్‌లు ఉన్నాయి.

టెర్మినల్‌, టవర్‌ భవనం, అప్రోచ్‌ రోడ్లు వున్నాయి. భవిష్యత్తులో విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై వెళ్లడానికి ఈ విమానాశ్రయంతో కర్నూలు వాసులకు ప్రయాణ సమయం తగ్గనుంది.