ఇకపై ఎవరైనా నీళ్ళను వృధాగా రోడ్లపైకి వదిలితే వారికి భారీ జరిమానా విధిస్తామంటోంది హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ). నీళ్లను రోడ్లపైకి వదలడంతో వేసిన రోడ్లు కొద్ది రోజులకే పాడైపోతున్నాయని, రోడ్ల మీద గుంతలు పడి బురదమయం అవుతున్నాయని ఈ నిర్ణయం తీసుకున్నట్టు బల్దియా కమిషనర్ దాన కిశోర్ తెలిపారు.
రోడ్లపైకొచ్చిన నీరు నిలువ వుండటంతో దోమలు కూడా పెరిగిపోతున్నాయని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో జీహెచ్ఎంసీ స్పందించింది. నీళ్లను రోడ్లపైకి వదిలేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జోనల్ కార్యాలయాలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. రోడ్లపైకి నీళ్ళు వదిలేవారికి రూ.2 వేల నుంచి రూ.2 లక్షల వరకు జరిమాన విధించాలని నిర్ణయించింది. మరి కొన్ని వారాల్లోనే ఇవి అమలు అవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్లో రోడ్లపైకి నీళ్లను వదులుతున్నఅపోలో ఆస్పత్రికి ఇటీవల రూ. 2 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే.
ఇలా నీళ్లను రోడ్ల మీదకు వదలడం వల్ల నగరంలోని రోడ్ల నిర్మాణం, నిర్వహణకు బల్దియా ఏటా ఖర్చుచేస్తున్న రూ.600 కోట్లు వృధా అవుతున్నాయని తెలిపారు.
ఈ సమస్య చాలా తీవ్రంగా ఉన్నట్టు ఇటీవల జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైనట్టు పేర్కొన్నారు.ఇంటిలోని వాడుక నీరు తప్పనిసరిగా డ్రైనేజీ కనెక్షన్ ద్వారా వెళ్లే ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు.Telugu news Leaving the water on roads From 2 thousand to 2 lakh fine …